T20 WC: హెడ్‌కోచ్‌ పదవికి సనత్‌ జయసూర్య గుడ్‌బై | Sanath Jayasuriya to step down as Sri Lanka head coach after T20 WC | Sakshi
Sakshi News home page

T20 WC: శ్రీలంక హెడ్‌కోచ్‌ పదవికి సనత్‌ జయసూర్య గుడ్‌బై

Feb 28 2026 1:07 PM | Updated on Feb 28 2026 1:16 PM

Sanath Jayasuriya to step down as Sri Lanka head coach after T20 WC

కుమార్‌ సంగక్కరతో సనత్‌ జయసూర్య

శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌, ప్రస్తుత హెడ్‌కోచ్‌ సనత్‌ జయసూర్య కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో శ్రీలంక- పాకిస్తాన్‌ మధ్య శనివారం నాటి మ్యాచ్‌ ముగిసిన తర్వాత పదవి నుంచి వైదొలగనున్నాడు.

ముందుగానే రాజీనామా
ఈ ఏడాది మార్చి 31 వరకు హెడ్‌కోచ్‌గా సనత్‌ జయసూర్య (Sanath Jayasuriya)కు పదవీకాలం ఉంది. అయితే, ముందుగానే వైదొలగాలని అతడు నిర్ణయించుకున్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో దారుణంగా ఓడిపోయి.. శ్రీలంక క్రికెట్‌ పతన స్థితికి చేరుకుంది. ఈ ఐసీసీ టోర్నీలో పరాభవం తర్వాత.. దాదాపు ఎనిమిది నెలల అనంతరం సనత్‌ జయసూర్య హెడ్‌కోచ్‌గా వచ్చాడు.

మిశ్రమ ఫలితాలు
టీమిండియాతో జూలై, 2024లో జరిగిన సిరీస్‌తో తాత్కాలిక హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సనత్‌ జయసూర్య.. ఊహించని రీతిలో లంకకు చారిత్రాత్మక విజయం అందించాడు. అతడి మార్గదర్శనంలో దాదాపు రెండున్నర శతాబ్దాల తర్వాత శ్రీలంక భారత్‌పై వన్డే సిరీస్‌ గెలిచింది. ఆ తర్వాత కూడా మిశ్రమ ఫలితాలు అందుకుంది.

మొత్తంగా దాదాపు 70 మ్యాచ్‌లలో లంక జట్టుకు సనత్‌ జయసూర్య మార్గదర్శనం చేయగా.. జయాపజయాలు దాదాపుగా సమానంగా ఉండటం గమనార్హం. అయితే, తాను ఈ పదవిలో పూర్తికాలం కొనసాగబోనని అతడు ఈ ఏడాది జనవరిలోనే స్పష్టం చేశాడు. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌-2026 ముగిసిన తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించాడు.

టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో మరోసారి వైఫల్యం
కాగా భారత్‌తో కలిసి శ్రీలంక టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. లీగ్‌ దశలో గ్రూప్‌-బి నుంచి పోటీ పడ్డ దసున్‌ షనక బృందం.. నాలుగింట మూడు విజయాలు సాధించింది. ఐర్లాండ్‌, ఒమన్‌, ఆస్ట్రేలియాలపై గెలిచిన లంక.. అనూహ్య రీతిలో జింబాబ్వే చేతిలో ఓడిపోయింది.

ఇక సూపర్‌-8 దశలో తొలుత ఇంగ్లండ్‌ చేతిలో 51 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన శ్రీలంక.. తదుపరి న్యూజిలాండ్‌ చేతిలో 61 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. తద్వారా సెమీస్‌ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక ఇలా సెమీ ఫైనల్‌కు చేరకుండానే ఇంటిబాట పట్టడం ఇది వరుసగా ఐదోసారి. 

ఈ నేపథ్యంలో మరోసారి లంక జట్టు ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇక సూపర్‌-8లో చివరగా పాకిస్తాన్‌తో శనివారం నాటి నామమాత్రపు మ్యాచ్‌లో లంక తలపడుతుంది. ఇందుకు పల్లెకెలె వేదిక.

చదవండి: T20 WC 2026 SL vs PAK: పాకిస్తాన్‌కు చావోరేవో.. గెలిస్తే సరిపోదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement