
పొట్టి క్రికెట్‌లో పట్టుమని 10 పరుగులు చేసినా అందులో ఓ సిక్సర్ తప్పక ఉంటుంది. అలాంటిది హాఫ్ సెంచరీనో లేక ఆపై స్కోరో చేస్తే కనీసం రెండు, మూడు సిక్సర్లైనా ఉంటాయి. పొట్టి ఫార్మాట్‌లో జరిగే ఏ మ్యాచ్‌లో అయినా ఈ తంతు సహజంగా జరుగుతుంటుంది.
అయితే తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఓ స్పెషలిస్ట్ బ్యాటర్ ఏకంగా 81 పరుగులు చేసినా ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నిన్న (సెప్టెంబర్ 3) శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 57 బంతులు ఎదుర్కొని ఒక్క సిక్సర్ కూడా లేకుండా 12 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో బెన్నెట్ ఓ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఫుల్ మెంబర్ సభ్య దేశాలు ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లో సిక్సర్ లేకుండా అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పేరిట సంయుక్తంగా ఉండేది.
బాబర్, ఫాఫ్ ఇద్దరూ గతంలో సిక్సర్ లేకుండా 79 పరుగులు చేశారు. ఈ రికార్డు జాబితాలో రికీ పాంటింగ్ లాంటి డాషింగ్ బ్యాటర్ కూడా ఉండటం విశేషం. అన్ని ఐసీసీ సభ్య దేశాలన్నిటీ పరిగణలోకి తీసుకుంటే ఈ రికార్డు మాల్వాయ్‌కు చెందిన సామి సోహైల్ పేరిట ఉంది. 2022లో అతను లెసోధోపై సిక్సర్ లేకుండా 94 పరుగులు చేశాడు.
ఒంటరి పోరాటం
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బెన్నెట్ ఒంటరిపోరాటం చేశాడు. జట్టులో మిగతా ఏ బ్యాటర్ ఓ మోస్తరు స్కోరైనా చేయలేకపోగా.. బెన్నెట్ ఒక్కడే దాదాపు సెంచరీ (87) చేసినంత పని చేశాడు. బెన్నెట్ రికార్డు ఇన్నింగ్స్ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఓ మోస్తరుకు మించిన స్కోర్ (175/7) చేసింది.
అనంతరం బౌలర్లు మ్యాచ్ మొత్తం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా ఒక్క ఓవర్ జింబాబ్వే కొంపముంచింది. మపోసా వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో కమిందు మెండిస్ 26 పరుగులు పిండుకుని శ్రీలంకను గెలిపించాడు. అంతకుముందు ఓపెనర్లు పథుమ్ నిస్సంక (55), కుసాల్ మెండిస్ (38) ఆడిన ఇన్నింగ్స్‌లు కూడా లంక గెలుపుకు దోహదపడ్డాయి.
ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో పర్యాటక శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 సెప్టెంబర్ 6న జరుగనుంది. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేసింది.