
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 9) జరగాల్సిన క్వాలిఫయర్ (వాషింగ్టన్ ఫ్రీడం వర్సెస్ టెక్సాస్ సూపర్ కింగ్స్) మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన వాషింగ్టన్ జట్టు ఫైనల్స్‌కు చేరింది.
ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని టీఎస్‌కే జులై 11న జరిగే ఛాలెంజర్ మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో టీఎస్‌కే జులై 9న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ (శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ వర్సెస్ ఎంఐ న్యూయార్క్) విజేతతో తలపడనుంది. ఛాలెంజర్‌లో గెలిచిన జట్టు జులై 13న జరిగే ఫైనల్లో వాషింగ్టన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.
ఇవాళ జరగాల్సిన క్వాలిఫయర్ మ్యాచ్ ఎడతెరిపిలేని వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది. 8:15 గంటల వరకు వేచి చూసిన అంపైర్లు వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో మ్యాక్స్‌వెల్ నేతృత్వంలోని వాషింగ్టన్ ఫ్రీడం మ్యాచ్ ఆడకుండానే అదృష్టం కలిసొచ్చి నేరుగా ఫైనల్‌కు చేరింది. ఈ సీజన్ పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. టీఎస్‌కే రెండో స్థానంలో నిలిచింది. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, ఎంఐ న్యూయార్క్ జట్లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఎలాంటి ముప్పు లేదు
శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, ఎంఐ న్యూయార్క్ మధ్య రేపు జరగాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తుంది. డల్లాస్‌లో రేపు వాతావరణం క్లియర్‌గా ఉండనుందని వాతావరణ శాఖ నివేదించింది. ఇవాల్టి క్వాలిఫయర్ మ్యాచ్ కూడా డల్లాస్‌లోనే ఉండింది.