స్వింగ్‌ 'స్టార్క్‌' సెంచరీ | Mitchell Starc to play 100th Test | Sakshi
Sakshi News home page

స్వింగ్‌ 'స్టార్క్‌' సెంచరీ

Jul 12 2025 4:44 AM | Updated on Jul 12 2025 4:44 AM

Mitchell Starc to play 100th Test

100వ టెస్టు ఆడనున్న మిచెల్‌ స్టార్క్‌

ఈ ఘనత సాధించనున్న రెండో ఆస్ట్రేలియా పేసర్‌గా గుర్తింపు 

ఓవరాల్‌గా 11వ పేస్‌ బౌలర్‌గా ఘనత  

అతడు లయలో ఉన్నాడంటే ప్రత్యర్థులు బెంబేలెత్తాల్సిందే! అతడు కొత్త బంతి అందుకున్నాడంటే జట్టుకు శుభారంభం దక్కాల్సిందే! యార్కర్‌ను ఇంత కచ్చితంగా కూడా వేయొచ్చా... అని క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన నైపుణ్యం అతడిది. ఇన్‌స్వింగర్‌ ఇంత అందంగా కూడా విసరొచ్చా అనే పనితనం అతడి సొంతం. 30 అడుగుల రనప్‌ నుంచి బంతి వేసేందుకు అతడు సిద్ధమవుతున్నాడంటేనే... క్రీజులో ఉన్న బ్యాటర్‌ మదిలో ఎన్నో సవాళ్లు! ఒకే బంతిని వేర్వేరుగా ఎలా వేయొచ్చో ఆధునిక క్రికెట్‌లో అతడికంటే బాగా మరెవరికీ తెలిసి ఉండకపోవచ్చు. 

ఇన్‌స్వింగర్, అవుట్‌ స్వింగర్, యార్కర్‌ ఇలా అతడి అమ్ములపొదిలోని అ్రస్తాలకు కొదవేలేదు. మనం ఇంతసేపు చెప్పుకున్నది ఆ్రస్టేలియా పేస్‌ స్టార్‌ మిచెల్‌ ఆరోన్‌ స్టార్క్‌ గురించే! ఆటను కేవలం ఇష్టపడితే సరిపోదు... దాన్ని గౌరవించాలి అని బలంగా నమ్మే ఈ ఆ్రస్టేలియా పేసర్‌ 100వ టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. నేడు కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌తో మొదలయ్యే మూడో టెస్టు (డే–నైట్‌) స్టార్క్‌ కెరీర్‌లో 100వ టెస్టు కానుంది. ఈ నేపథ్యంలో స్వింగ్‌ స్టార్‌ స్టార్క్‌ గురించి తెలుసుకుందామా! - సాక్షి క్రీడా విభాగం

2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌... తొలి ఓవర్‌ వేసిన స్టార్క్‌ ఐదో బంతికి న్యూజిలాండ్‌ కెప్టెన్ మెకల్లమ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. కివీస్‌ సారథి రెప్పవేసేలోపు... లోపలికి దూసుకొచ్చిన రిప్పర్‌ అతడి వికెట్లను చెల్లాచెదురు చేసింది. ‘ఆదిలోనే హంసపాదు’ అన్నట్లు ఆరంభంలోనే దెబ్బతిన్న న్యూజిలాండ్‌ ఇక ఏ దశలోనూ కోలుకోలేకపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ టోర్నీ ఆసాంతం యార్కర్ల పండగ చేసుకున్న స్టార్క్‌ వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. 

50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఖాతాలో వేసుకున్న ఈ ఆసీస్‌ పేసర్‌... 2024 ఐపీఎల్‌ ఫైనల్లోనూ దాదాపు ఇదే తరహా బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టార్క్‌... ఫైనల్‌ తొలి ఓవర్‌ ఐదో బంతికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఆఫ్‌వికెట్‌ను గిరాటేశాడు. ఇక ఆ తర్వాత ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన రైజర్స్‌ రన్నరప్‌గానే సీజన్‌ను ముగించింది. 

ఈ రెండు సందర్భాల్లోనూ ఆయువుపట్టు మీద దెబ్బకొట్టిన ఘనత స్టార్క్‌దే. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇలాంటి ఎన్ని అద్భుతాలు చేసినా... టెస్టు క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ ఒక పేస్‌ బౌలర్‌ 100వ టెస్టు మ్యాచ్‌ ఆడటం అంటే ఆషామాషీ కాదు. ఆస్ట్రేలియా తరఫున మెక్‌గ్రాత్‌ తర్వాత 100వ టెస్టు ఆడుతున్న రెండో పేస్‌ బౌలర్‌గా స్టార్క్‌ నిలువనున్నాడు.  

మెక్‌గ్రాత్‌ బాటలో...  
ఆ్రస్టేలియా పేస్‌ దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ఆటకు వీడ్కోలు పలికిన నాలుగేళ్ల తర్వాత 2011లో స్టార్క్‌ టెస్టు అరంగేట్రం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో మెకల్లమ్‌ను అవుట్‌ చేసి తొలి వికెట్‌ ఖాతాలో వేసుకున్న స్టార్క్‌... రోజు రోజుకూ మరింత మెరుగవుతూ ముందుకు సాగాడు. క్రమశిక్షణకు కష్టపడేతత్వం తోడైతే ఫలితాలు సాధించొచ్చు అని నిరూపించిన స్టార్క్‌ అనతి కాలంలోనే ఆస్ట్రేలియా ప్రధాన పేసర్‌గా గుర్తింపు పొందాడు. 14 ఏళ్ల వయసు వరకు వికెట్‌ కీపర్‌గా కొనసాగి... ఆ తర్వాతే బౌలర్‌గా మారిన స్టార్క్‌ బరిలోకి దిగిన ప్రతీసారి ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా సాగుతున్నాడు. 

ఆరున్నర అడుగుల ఎత్తు... అందులోనూ ఎడంచేతి వాటం... ఇంకేముంది వాయువేగంతో అతడు విసిరే బంతికి బదులు చెప్పాలంటే ప్రత్యర్థి బ్యాటర్‌ ఎంతగానో శ్రమించాల్సిందే. ముఖ్యంగా స్టార్క్‌ గురిచూసి వేసే యార్కర్‌కు ప్రత్యేక ‘ఫ్యాన్‌ బేస్‌’ ఉందనడంలో అతిశయోక్తి లేదు. కళ్లు మూసి తెరిచేలోపు లోపలికి దూసుకొచ్చే బంతి వికెట్లను ఎగరేసే విధానం చూసి తీరాల్సిందే. స్టార్క్‌ మనసు పెట్టి ఇన్‌స్వింగర్‌ సంధిస్తే అది వికెట్లను గిరాటేయాల్సిందే. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యంత ప్రమాదకర బౌలర్‌గా ఎదిగిన స్టార్క్‌... కెరీర్‌లో పలుమార్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 

ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌లో ప్రభావం చూపలేడని పక్కన పెట్టడం... భారత్‌తో ‘బోర్డర్‌–గావస్కర్‌’ ట్రోఫీ సిరీస్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం ఇలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటికి ఎదురొడ్డి నిలిచిన స్టార్క్‌... తన బౌలింగ్‌తోనే విమర్శకులకు సమాధానాలు ఇచ్చాడు. స్టార్క్‌ భార్య అలీసా హీలీ కూడా మేటి క్రికెటర్‌ కావడంతో క్లిష్ట సమయాల్లో అతనికి కుటుంబం నుంచి కూడా అండదండలు లభిస్తున్నాయి.  

ఐపీఎల్‌ను కాదని...
ప్రపంచ వ్యాప్తంగా ఆటగాళ్లంతా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో పాల్గొనాలని పోటీపడుతుంటే... స్టార్క్‌ మాత్రం జాతీయ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన చేసేందుకు కొన్ని సీజన్‌ల పాటు ఐపీఎల్‌కు దూరంగా ఉండటం అతడి నిబద్ధతను చాటుతోంది. ‘అతడు చాలా ప్రత్యేకం. ఆస్ట్రేలియా వంటి పేస్‌ పిచ్‌లపై ఎక్కువ బాధ్యతలు మోస్తూ 100 మ్యాచ్‌లు ఆడటం చాలా గొప్ప. అతడి సన్నద్ధత, వ్యూహాలు చాలా భిన్నంగా ఉంటాయి.

పనిభారం దృష్ట్యా పలు సీజన్ల పాటు ఐపీఎల్‌కు సైతం అతడు దూరమయ్యాడు. అలాంటి ‘మ్యాచ్‌ విన్నర్‌’ జట్టులో ఉండటం ఆ్రస్టేలియా అదృష్టం. సుదీర్ఘ కాలంగా అతడు చూపిన పట్టుదలకు 100వ టెస్టు రూపంలో ఫలితం దక్కుతోంది’ అని ఆ్రస్టేలియా హెడ్‌ కోచ్‌ మెక్‌డొనాల్డ్‌ అన్నాడు. 2021 నుంచి గణాంకాలను పరిశీలిస్తే... అత్యధిక (1066) ఓవర్లు వేసిన పేసర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన స్టార్క్‌... వికెట్ల వేటలోనూ ముందు వరుసలో ఉన్నాడు. 

సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇప్పటి వరకు 395 వికెట్లు పడగొట్టిన స్టార్క్‌... 100వ మ్యాచ్‌లోనే 400 వికెట్ల మైలురాయిని దాటాలని భావిస్తున్నాడు. ఫిట్‌నెస్‌లో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఈ కంగారూ పేసర్‌... గాయాలతో సతమతమవుతున్న సమయంలోనూ బాధ్యతలను పక్కన పెట్టలేదు. 2022లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విరిగిన వేలుతోనే బౌలింగ్‌ చేసిన స్టార్క్‌... 2023 యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా గజ్జల్లో గాయం ఇబ్బంది పెడుతున్న జాతీయ విధులను విస్మరించలేదు. 

35 ఏళ్ల వయసులో ఓ పేస్‌ బౌలర్‌ తన అత్యుత్తమ ప్రదర్శన సాగించడం విస్మయానికి గురిచేస్తోందని సహచర పేసర్, ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్‌ కితాబిచ్చాడు. ‘145 కిలోమీటర్లకు పైగా వేగంతో ఒక పేసర్‌ 100 మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ చేయడం మామూలు విషయం కాదు. అతడో యోధుడు. ఎప్పటికప్పుడు మెరుగవుతూ ఉండటం అతడికే సాధ్యం’ అని కమిన్స్‌ అన్నాడు. మరెంత కాలం కెరీర్‌ కొనసాగిస్తాడో ఇప్పుడే చెప్పలేకపోయినా... ప్రస్తుతానికి మాత్రం అతడే ఆ్రస్టేలియా ప్రధాన అస్త్రం.  

బ్యాటింగ్‌లోనూ భళా... 
ప్రపంచ క్రికెట్‌కు ఆ్రస్టేలియా అందించిన మరో ఆణిముత్యమైన స్టార్క్‌... కేవలం బౌలింగ్‌లోనే కాకుండా ఉపయుక్తకర బ్యాటింగ్‌తోనూ ఆకట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. మామూలుగా సుదీర్ఘంగా బౌలింగ్‌ చేసే పేసర్లు నెట్స్‌లోనూ పెద్దగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయరు. కానీ స్టార్క్‌ తీరు అందుకు భిన్నం. కిందివరస బ్యాటర్లు జతచేసే పరుగులు జట్టుకు ఎంతో విలువ చేకూరుస్తాయి అని నమ్మే స్టార్క్‌... అవసరమైనప్పుడల్లా తన బ్యాటింగ్‌ ప్రతిభను ప్రపంచానికి చాటాడు. 

అంతెందుకు ఇటీవల ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోనూ స్టార్క్‌ తన బ్యాటింగ్‌ నైపుణ్యం చూపెట్టాడు. స్టార్‌ ఆట గాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు చేరుతున్న సమయంలో దక్షిణాఫ్రికా పేసర్ల ధాటికి ఎదురునిలిచి అతడు చేసిన అర్ధశతకమే మ్యాచ్‌లో ఆసీస్‌ను పోరాడే స్థితికి చేర్చింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో స్టార్క్‌ బ్యాట్‌తో 2311 పరుగులు చేశాడు. 

ఓ ప్రధాన పేసర్‌ ఇన్ని పరుగులు చేయడం అంత తేలికైన విషయం కాదు. ఇక ‘డే అండ్‌ నైట్‌’ టెస్టుల్లో అయితే స్టార్క్‌కు తిరుగులేదనేది జగమెరిగిన సత్యం. గులాబీ బంతితో అత్యంత ప్రమాదకారి అయిన స్టార్క్‌... ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో కరీబియన్‌ బ్యాటర్లతో ఓ ఆటాడుకోవడం ఖాయమే.

16 టెస్టు ఫార్మాట్‌లో 100 టెస్టులు పూర్తి చేసుకోనున్న 16వ ఆ్రస్టేలియా క్రికెటర్‌గా స్టార్క్‌గుర్తింపు పొందనున్నాడు. పాంటింగ్‌ (168), స్టీవ్‌ వా (168), అలెన్‌ బోర్డర్‌ (156), షేన్‌ వార్న్‌ (145), లయన్‌ (139), మార్క్‌ వా (128), మెక్‌గ్రాత్‌ (124), ఇయాన్‌ హీలీ (119), స్టీవ్‌ స్మిత్‌ (118), మైకేల్‌ క్లార్క్‌ (115), డేవిడ్‌ వార్నర్‌ (112), బూన్‌ (107), లాంగర్‌ (105), మార్క్‌ టేలర్‌ (104), మాథ్యూ హేడెన్‌ (103) ఈ జాబితాలో ఉన్నారు.

83 టెస్టు క్రికెట్‌ చరిత్రలో 100 టెస్టులు పూర్తి చేసుకోనున్న 83వ క్రికెటర్‌గా స్టార్క్‌ ఘనత సాధించనున్నాడు.

11 ఇప్పటి వరకు 82 మంది క్రికెటర్లు 100 టెస్టుల మైలురాయి దాటారు. ఇందులో 10 మంది మాత్రమే స్పెషలిస్ట్‌ పేస్‌ బౌలర్లు (అండర్సన్, స్టువర్ట్‌ బ్రాడ్, కొట్నీ వాల్‌‡్ష, మెక్‌గ్రాత్, చమిందా వాస్, షాన్‌ పొలాక్, టిమ్‌ సౌతీ, ఇషాంత్‌ శర్మ, వసీం అక్రమ్, మఖాయ ఎన్తిని) ఉన్నారు. స్టార్క్‌ 11వ పేస్‌ బౌలర్‌గా గుర్తింపు పొందుతాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement