
మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన కన్నప్ప (Kannappa) సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా బాగుందని ఆయన మెచ్చుకున్నారు. కానీ, అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ ఎందుకు రాలేదో కూడా మీడియాతో తెలిపారు. ఈ కథకు ఇన్ని కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని కూడా తమ్మారెడ్డి చెప్పారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. అయితే, పదిరోజుల్లో కేవలం రూ. 50 కోట్ల మార్క్‌ను కూడా కన్నప్ప అందుకోలేకపోయింది. దీంతో నిర్మాతగా ఉన్న మొహన్ బాబుకు భారీ నష్టాలు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది.
కన్నప్ప సినిమా గురించి తమ్మారెడ్డి భరద్వాజ ఇలా మాట్లాడారు.' కన్నప్ప సినిమా చూశాను. చాలా బాగుంది. కానీ, సినిమా తెరకెక్కించే విషయంలో పాన్ ఇండియా రేంజ్ గురించి మాత్రమే ఆలోచించారు. అయితే, భక్తికి తగ్గ రేంజ్‌లో జాగ్రత్తలు తీసుకోలేదు. భక్తి అనే కాన్సప్ట్‌ను ప్రధానంగా తీసుకుని కన్నప్పను నిర్మించింటే బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉండేది.

సినిమాలో శివుడు (అక్షయ్ కుమార్), పార్వతి (కాజల్ అగర్వాల్)ని చూస్తుంటే నాకు ఇరిటేషన్ వచ్చింది. వారిద్దరు తప్పా మిగిలిన పాత్రలు అన్నీ బాగున్నాయి. కన్నప్ప సినిమా చూస్తున్నంత సేపు 'అన్నమయ్య' కాన్సప్ట్ గుర్తుకు వస్తుంది. ఔట్ డేటెడ్ కాన్సప్ట్‌ను తీసుకున్నారని అనిపించింది. ఏదేమైనా విష్ణును అభినందించాలి. కన్నప్ప విషయంలో బాగా కష్టపడ్డాడు. కానీ, అందుకు తగిన ఫలితం మాత్రం దక్కలేదు. సినిమాపై కొందరు భారీగా ట్రోల్ చేశారు. కానీ, బ్యాడ్ రిపోర్ట్ రాలేదు. సినిమా ఒక్కసారి అయినా చూడాల్సిందే అనే రివ్యూలు వచ్చాయి.' అని ఆయన అన్నారు.