
నేను రెండోసారి గర్భవతిని. ఇప్పుడు స్కాన్‌లో స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తేలింది. ఇది ప్రమాదకరమా? ఆపరేషన్ తప్పకుండా చేయించుకోవాలా?
– మధు, విశాఖపట్నం
స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఒక అరుదైన గర్భధారణ సమస్య. ఇది సాధారణంగా గర్భాశయంలో ఏర్పడే గర్భం కాకుండా, గతంలో సిజేరియన్ చేసిన కుట్టు వద్ద ఏర్పడుతుంది. ఇది సుమారు రెండువేల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే సమస్య. ప్రస్తుతం సిజేరియన్ డెలివరీల సంఖ్య పెరగడం, స్కానింగ్ పరికరాల మెరుగుదల వలన స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని సకాలంలో గుర్తించడం సాధ్యమవుతోంది.
కానీ, ఈ గర్భం కొనసాగితే తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో గర్భాశయపు కుట్టు తెరుచుకోవడం, గర్భాశయం చీలిపోవడం వంటి ప్రమాదాలు ఉన్నాయి. గర్భం పెరిగే కొద్దీ కుట్టుపై ఒత్తిడి పెరిగి అది తెరుచుకోవచ్చు. ఇది ప్రాణాపాయ పరిస్థితికి దారి తీసే అవకాశం ఉంది.
ఇంకా, స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వలన ప్లాసెంటా గర్భాశయ గోడకు గట్టిగా అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. దీనిని ప్లాసెంటా అక్రీటా స్పెక్ట్రమ్ అంటారు. ఇది గర్భధారణ చివర్లో తీవ్రమైన రక్తస్రావానికి కారణమవుతుంది. కొన్నిసార్లు ప్లాసెంటా మూత్రాశయానికి కూడా అతుక్కుపోతుంది. అలాంటి పరిస్థితుల్లో గర్భాశయాన్ని పూర్తిగా తీసేయాల్సి రావచ్చు.
ఇవన్నీ ముందుగా గుర్తించడం కష్టం. చాలా సందర్భాల్లో చిన్న లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. ప్రసవ సమయంలో కూడా స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వలన తీవ్రమైన రక్తస్రావం సంభవించవచ్చు. ముఖ్యంగా ప్లాసెంటా వేరుచేసే సమయంలో ఇది జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో గర్భాశయాన్ని తొలగించడం, రక్త మార్పిడి, ఐసీయూలో చికిత్స అవసరం కావచ్చు. గర్భాన్ని కొనసాగించాలంటే అత్యంత జాగ్రత్తగా, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఉండాలి.
అవసరమైన ప్రత్యేక స్కాన్లు, పరీక్షలు చేయించుకోవాలి. స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్న చోట ప్లాసెంటా అతుక్కుపోతే, పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసి, తగిన నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గర్భాన్ని తొలగించడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తారు. దీనికోసం కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒకటి: చిన్న రంధ్రాల ద్వారా శస్త్రచికిత్స చేసి గర్భాన్ని తొలగించడం.
ఈ సమయంలో గత కుట్టు భాగాన్ని బలపరచే చర్యలు కూడా తీసుకుంటారు. తద్వారా భవిష్యత్తులో స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మళ్లీ కలుగకుండా ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో, స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో ఉంటే, మిథోట్రెక్సేట్ అనే ఔషధాన్ని గర్భాశయంలోకి నేరుగా ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి, గర్భాన్ని ఆపవచ్చు. ఇది గర్భం చాలా చిన్న దశలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది.
చివరిగా, డి అండ్ సి (డైలటేషన్ అండ్ క్యూరెటేజ్) అనే చిన్న శస్త్రచికిత్స ద్వారా కూడా గర్భాన్ని తొలగించవచ్చు. కాబట్టి, స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా ప్రసూతి నిపుణులను కలసి, గర్భాన్ని కొనసాగించాలా లేక తొలగించాలా అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. భవిష్యత్తులో సురక్షితమైన గర్భధారణ కోసం ఇది చాలా అవసరం.
డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
(చదవండి: శాకాహారుల్లో బీ12 లోపం అంటే..?)
∙