
మనం చేసే అన్ని పనులకూ మెదడు, నాడీ వ్యవస్థ నుంచే ఆదేశాలు అందుతూ ఉంటాయి. అలాంటి ఆ మెదడు నుంచి జీవక్రియలకు సంబంధించిన ఆదేశాలన్నీ పలు అవయవాలకూ సక్రమంగా అందడానికి ఉపయోగపడే కీలకమైన పోషకం ‘విటమిన్–బి12’. ఇది మెదడు కార్యకలాపాలకోసం మాత్రమే కాకుండా రక్తం ఉత్పత్తికీ, కణంలో డీఎన్‌ఏ ఆవిర్భవించడానికి, మెటబాలిజమ్‌లో పాలుపంచుకునే అమైనో యాసిడ్స్ కార్యకలాపాలకూ చాలా కీలకం, ఎంతో అవసరం! శాకాహార వనరుల్లో విటమిన్ బి12 బాగా తక్కువ. వాళ్లలో ఈ విటమిన్ లోపాన్ని భర్తీ చేసుకోవడమెలాగో చూద్దాం.
మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో విటమిన్ బి12 లోపం చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. కారణం... ఈ విటమిన్‌కు మాంసాహారం మంచి వనరు. దాంతో శాకాహార నియమాన్ని కఠినంగా పాటించేవారిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాంటి వారు ఈ లోపాన్ని భర్తీ చేసుకోవడమెలాగో తెలుసుకుందాం.
శాకాహారుల్లో ఎందుకు తక్కువంటే...
విటమిన్ బి12ను మొక్కలూ లేదా జంతువులూ ఇవేవీ సృష్టించలేవు. కేవలం కొన్ని బ్యాక్టీరియాతోపాటు ఆర్కియా అనే ఒక రకం ఏకకణ జీవులు మాత్రమే ఈ విటమిన్‌ను సృష్టించగలవు.
ఆర్కియా ఎంత చిన్న జీవి అంటే... ఇది ఏకకణజీవికంటే కూడా చాలా చిన్నది. ఈ ఏకకణజీవికి న్యూక్లియస్ (కేంద్రకం) కూడా ఉండదు. దాంతో ఇది ఒక కణమనీ, కణంలోని భాగాలని వివిధ భాగాలంటూ చెప్పడానికి కూడా వీలు కానంత చిన్న కణమిది. అయితే... బ్యాక్టీరియా, ఆర్కియా వెలువరించే కొన్ని రకాల ఎంజైముల కలయికతో ఈ సృష్టిలో విటమిన్–బి12 నేచురల్‌గా తయారవుతుంది.
జంతువులకు మేలు చేసే బ్యాక్టీరియా మనుగడ సాగించే చోట... అంటే... జంతువుపై ఆధారపడిన బ్యాక్టీరియాలోనూ, ఆ బ్యాక్టీరియా నుంచి వెలువడే పదార్థాల్లోనూ ఇది ఉంటుంది. అందుకో కారణం ఉంది. జీవుల్లో ఉంటూ... ఆ జీవుల నుంచి తమకు అవసరమైనవి తీసుకుంటూ... వాటికి విటమిన్ బి–12 ఇస్తూ ఉండే క్రమంలో విటమిన్ బి–12 వెలువడుతుంది. ఇలా జీవుల మాంసం, ఉత్పాదనల్లోనుంచి వెలువడుతుంది కాబట్టి శాకాహార పదార్థాల్లో ఇది తక్కువ కావడంతో శాకాహారులలో ఈ లోపం రావడానికి అవకాశాలెక్కువ.
ఇంకా ఎవరెవరిలో తక్కువ...
సాధారణంగా 75 ఏళ్లకు పైగా వయసు పైబడిన వారిలో
పుట్టుకతో వచ్చే జబ్బు అయిన ‘పెర్నీషియస్ అనీమియా’ అనే కండిషన్ ఉన్నవారిలో. ఈ కండిషన్ ఉన్నవారిలో ఒక ప్రోటీన్ లోపం వల్ల జీర్ణమైన ఆహారం నుంచి విటమిన్ బి12 ను తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. దాంతో ఈ సమస్యతో బాధపడే కుటుంబ చరిత్ర ఉన్న వారిలో, 60 ఏళ్లు దాటిన మహిళల్లో ఇది ఎక్కువ పొట్ట లోపలిపార పలచబారిన వారిలోనూ ఇది తక్కువ ∙పొట్టలో అల్సర్స్ ఉన్నవారిలో
పొట్టలోని కొంతభాగాన్ని సర్జరీ ద్వారా తొలగించిన వారిలో ∙
జీర్ణవ్యవస్థ తాలూకు దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారిలో
చాలాకాలంగా అజీర్తి మందులు (ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ –పీపీఐ) వాడుతున్నవారిలోనూ విటమిన్ బి12 మోతాదులు తక్కువగా ఉండే అవకాశముంది.
నిర్ధారణ: సాధారణ రక్తపరీక్ష ద్వారా విటమిన్ బి12 తగ్గడంతోపాటు... ఆ పరీక్షతో తెలిసే ఎర్రరక్తకణాల సైజ్‌ను బట్టి ఈ విటమిన్ లోపాన్ని తెలుసుకుంటారు.
నివారణ ..
సాధారణంగా మాంసాహారంతో పాటు గుడ్లు, సముద్రపు చేపల్లో విటమిన్ బి12 ఎక్కువ. అయితే మాంసాహారం తీసుకోని వారందరూ. ఇవి తీసుకోవచ్చు.
పాలు, పాల ఉత్పాదనలు.. అందునా విటమిన్ బి12తో నింపిన (అంటే... విటమిన్ బి12 ఫోర్టిఫైడ్) బాదం సాల (ఆల్మండ్ మిల్క్)లో; విటమిన్ బి12 ఫోర్టిఫైడ్ కొబ్బరిపాలలో;
విటమిన్ బి12 ఫోర్టిఫైడ్ సోయాపాలలోనూ ఇది ఎక్కువ
త్వరగా పులిసిపోడానికి అవకాశమున్న పిండితో చేసిన ఇడ్లీ, దోస వంటి ఆహారాలు
తక్షణం తినగలిగే తృణధాన్యాలు (సిరేల్స్)లో ∙తక్కువ కొవ్వు కలిగిన పాలను తోడబెట్టడంతో వచ్చే పెరుగు (యోగర్ట్)లో
పాలలోనూ, చీజ్‌లోనూ, వెనిలా ఐస్‌క్రీమ్‌లోనూ విటమిన్ బి12 ఎక్కువ.
చికిత్స ఇలా...
రక్తపరీక్షలో విటమిన్ బి12 మోతాదులు మరీ తక్కువగా ఉన్నాయని తేలితే... వాళ్లకు సాధారణంగా ఆరు బి12 ఇంజెక్షన్లతో ఈ లోపాన్ని భర్తీ చేస్తారు. ఇది రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున నాలుగు రోజులకు ఒకటి మోతాదులో ఈ ఇంజెక్షన్ చేస్తుంటారు. ఇలా ఇచ్చిన విటమిన్
బి12 కాలేయంలో నిల్వ ఉండిపోయి దేహానికి అవసరమైన జీవక్రియలకోసం ఉపయోగపడుతూ ఉంటుంది.
ఒకవేళ పెర్నీషియస్ అనీమియా కారణంగా విటమిన్ బి12 లోపం ఉన్నవారైతే... డాక్టర్లు చెప్పిన మోతాదుల్లో జీవితకాలం పాటు విటమిన్ బి12ను తీసుకుంటూనే ఉండాలి. ఇలా విటమిన్ బి12 తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఒకవేళ ΄ోషకాహారలోపం వల్ల విటమిన్ బి12 లోపం ఏర్పడితే అప్పుడు ఇంజెక్షన్ రూపంలో కాకుండా సైనకోబాలమైన్ టాబ్లెట్ల రూపంలోనూ దీన్ని శరీరానికి అందిస్తారు.
చివరగా...
విటమిన్–బి12 టాబ్లెట్లను, ఇంజెక్షన్లను ఎవరికి వారుగా తీసుకుంటూ సొంతవైద్యం చేసుకోకూడదు. కేవలం డాక్టర్ల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఎందుకంటే... ఈ ఇంజెక్షన్లనూ, మాత్రలనూ తీసుకునేవారు తమ ఇతరత్రా ఆరోగ్య సమస్యల కోసం వేరే మందులు వాడుతుంటే వాటి కార్యకలపాలకు ఈ విటమిన్ బి12 ఇంజెక్షన్లూ, మాత్రలూ అడ్డురాకుండా ఉండేలా డాక్టర్లు వాటి మోతాదు నిర్ణయిస్తారు. అందుకే ఈ విటమిన్‌ను డాక్టర్ల పర్యవేక్షణలోనే, వారు సూచిస్తేనే వాడాలి.
లక్షణాలు...
విటమిన్ బి12 లోపం ఉన్నవాళ్లలో నీరసం, నిస్సత్తువ, అలసట చాలా ఎక్కువ. ఒక్కోసారి ఊపిరి సరిగా అందక ఆయాసం
అన్ని అవయవాలకూ ఆక్సిజన్‌ను తీసుకెళ్లేందుకు అవసరమైన ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ కారణంగా వచ్చే రక్తహీనతను ‘విటమిన్–బి12 డెఫిషియెంట్ అనీమియా’ అంటారు.
ఈ కండిషన్ ఉన్నప్పుడు ఏర్పడే పరిస్థితిని ఎదుర్కొనేందుకు శరీరం చాలా పెద్దసైజు ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటినే మెగాలోబ్లాస్టిక్, మ్యాక్రోసైటిక్ ఆర్‌బీసీ ఉంటారు. ఇవి ఆక్సిజన్ మోసుకెళ్లాల్సిన పనిని సక్రమంగా చేయలేవు ∙తరచూ తలనొప్పి, చెవుల్లో హోరు వినిపించడం, ఆకలి లేపోకవడం.
బీ 12 లోపంతో మరింత నిర్దిష్టంగా కనిపించే మరికొన్ని లక్షణాలు
చర్మం పసుపుపచ్చరంగులోకి మారడం నాలుక పూత, నోట్లో పుండ్లు ∙చర్మం కొన్ని ప్రదేశాల్లో స్పర్శజ్ఞానం కోల్పోవడం నొప్పి ఎక్కువగా తెలియకపోవడం నడుస్తూ నడుస్తూ పడిపోవడం
చూపు సరిగా లేక స్పష్టంగా కనిపించకపోవడం క్షణక్షణానికీ మూడ్స్ మారిపోవడం, డిప్రెషన్‌కు గురికావడం, మతిమరుపు.
(చదవండి: ఈ ఇల్లు ఎవరిదో తెలుసా?)