ఆరంఘర్‌లో ఆ బస్సు ఎక్కిందెవరు?
19 మృతదేహాలకు సంబంధించి 18 మంది కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ సేకరణ
మరో మృతదేహం కోసం ఎవరూ రాని వైనం
ప్రమాద తీవ్రతపై మూడు రోజుల్లో ఫోరెన్సిక్ నివేదిక
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు సమీపంలో అగ్నికి ఆహుతైన బస్సులో టిక్కెట్లు ముందుగా బుక్ చేసుకున్న 40 మందిలో ఓ వ్యక్తి చివరి నిమిషంలో బస్సు ఎక్కక పోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే క్రమంలో ముందుగా టిక్కెట్ బుక్ చేసుకోకుండా ఆరంఘర్‌లో బస్సు ఎక్కిన ఓ వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీంతో 19 మంది మృతుల్లో 18 మందికి సంబంధించిన కుటుంబ సభ్యుల నుంచి ఫోరెన్సిక్ వైద్యులు డీఎన్‌ఏ నమూనాలు సేకరించారు. మరో మృతుని బంధువులు మాత్రమే రాలేదు.
కలెక్టరేట్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్లకు కూడా ఎవ్వరూ ఫోన్ చేయలేదు. ఎవరైనా రెండు రోజులుగా కుటుంబ సభ్యులతో సంబంధాలు లేకుండా ఉండి, వ్యక్తి మిస్సయ్యారని భావిస్తే కంట్రోల్ రూంకు ఫోన్ చేయాలని కలెక్టర్ సిరి తెలిపారు. ఈ వ్యక్తి బంధువులు వస్తే, వారి డీఎన్‌ఏ సేకరించి, దాంతో సరిపోలిన డీఎన్‌ఏ ఉన్న మృతదేహాన్ని అప్పగిస్తారు. ఒకటి రెండు రోజుల్లో డీఎన్‌ఏ రిపోర్టులు రానున్నాయి. ఆ వెంటనే 18 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహానికి సంబంధించి సంబంధితులు ఎవరూ రాకపోతే మార్చురీలోనే ఉంచనున్నారు.
ప్రమాదంపై ఎఫ్‌ఎస్‌ఎల్‌లో పరిశోధన
బస్సు ప్రమాదం, ప్రమాద తీవ్రత కారణాలపై ఎఫ్‌ఎస్‌ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ) అధికారులు పరిశోధన చేస్తున్నారు. ఇప్పటి వరకు బస్సు ప్రమాదంపై ఎలాంటి ప్రాథమిక నివేదిక ఇవ్వలేదని, మూడు రోజుల్లో నివేదిక ఇస్తామని ఫోరెన్సిక్ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఫోరెన్సిక్ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు.. బైక్ పెట్రోల్ ట్యాంకు పేలి మంటలు చెలరేగడంతో పాటు బస్సు డీజిల్ ట్యాంకు పక్కన లైటింగ్, ఇతర అవసరాల కోసం వినియోగించే రెండు పెద్ద బ్యాటరీలు పేలాయి. దీనివల్ల పేలుడు సంభవించింది.
అలాగే ప్రయాణికుల సెల్‌ఫోన్‌లతో పాటు లగేజీ క్యారియల్‌లో ఉన్న 200 సెల్‌ఫోన్‌లలో కొన్ని పేలాయి. అయితే సెల్‌ఫోన్‌లు పేలడంతో ప్రమాద తీవ్ర పెరగలేదని వారు చెబుతున్నారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో జరిగిన జబ్బార్ బస్సు ట్రావెల్స్‌లో కూడా బ్యాటరీలు పేలాయని చెప్పారు. ప్రస్తుత బస్సు ప్రమాదంలో మాత్రం సెల్‌ఫోన్‌లలో కొన్ని మాత్రమే కాలిపోయాయని, తక్కినవన్నీ బాక్సులో అలాగే ఉన్నాయని తెలిపారు. డ
డీఎన్‌ఏ నమూనాలు విమానంలో తీసుకెళ్లేందుకు నిరాకరణ
బస్సు ప్రమాదంలో మృతుల గుర్తింపు అందుకే ఆలస్యం!
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి డీఎన్‌ఏ నమూనాలతో పాటు వారి కుటుంబీకుల రక్త శాంపిల్స్‌ను విమానంలో విజయవాడ తీసుకెళ్లేందుకు నిరాకరించినట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మృతదేహాల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలు తీసి డబ్బాల్లో భద్రపరిచారు. వాటిని విమానంలో విజయవాడ తరలించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు.
అయితే చివరి నిమిషంలో విమానంలో డీఎన్‌ఏ నమూనాలు తీసుకెళ్లేందుకు నిరాకరించారని సమాచారం రావడంతో వైద్యులు నిట్టూర్చారు. దీంతో రాత్రి 2 గంటల సమయంలో మొత్తం మృతదేహాల నుంచి సేకరించిన నమూనాలతో పాటు కుటుంబీకుల రక్త శాంపిల్స్‌ను మహాప్రస్థానం వాహనంలో మంగళగిరిలోని ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీకి పంపించారు. సాధారణంగా కర్నూలు నుంచి విజయవాడకు వాహనంలో వెళ్లేందుకు 8 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అదే విమానంలో అయితే గంటలో వెళ్లిపోవచ్చు.
ప్రమాదాలు జరిగినప్పుడు మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్న సమయంలో డీఎన్‌ఏ పరీక్షల నివేదిక అనివార్యమైనప్పుడు.. సమయాన్ని ఎంతగా తగ్గిస్తే అంత త్వరగా బాధితులకు సాంత్వన చేకూర్చవచ్చు. విమానంలో వాటిని తరలించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు అంగీకరించకపోవడం విమర్శలకు తావిస్తోంది. విమానంలో పంపి ఉంటే డీఎన్‌ఏ నివేదికలు 12 గంటలు ముందుగా వచ్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం డీఎన్‌ఏ పరీక్షల నివేదికలు రావాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే. అప్పటివరకు మృతదేహాల కోసం వారి కుటుంబసభ్యులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


