పేదలకు ‘ఏడు’పే మిగిలింది!
రేషన్ షాపులను కచ్చితంగా ఒకటో తేదీ నుంచి 16వ తేదీ వరకు తెరవాల్సిందే. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు వినియోగదారులకు అందుబాటులో ఉండాలి. అలా లేని పక్షంలో షాపులను సీజ్ చేస్తాం. కర్నూలు నగరంలో ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. తనిఖీలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
–వెంకటరాముడు, ఇన్‌చార్జి డీఎస్‌ఓ, కర్నూలు
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ చౌక దుకాణాల్లో పేదలకు నిత్యావసరాలు అందడం లేదు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి రెండు వారాల పాటు రేషన్‌ణ సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఏడు రోజుల్లోనే జిల్లాలో దాదాపు అన్ని రేషన్ దుకాణాలు మూతపడుతున్నాయి. ఏడు రోజుల్లో పేదలు రాకుంటే షాపులకు డీలర్లు తాళాలు వేస్తున్నారు. మూసిన షాపులు ఎప్పుడు తెరుస్తారని ప్రజలు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో గత ప్రభుత్వ హయాంలోనే సరులకు పంపిణీ బాగుండేదని, నేరుగా ఇళ్ల దగ్గరకే ఆటోల ద్వారా తీసుకొచ్చి ఇస్తుండడంతో ఎలాంటి మోసాలు, అక్రమాలు జరిగేవి కావని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమాల ‘ముద్ర’
జిల్లాలో 1,233 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 6,34,631 కార్డుదారులు ఉండగా వాటిలో దాదాపు 12.5 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా 10,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం కేటాయిస్తోంది. ప్రతి నెలా 1 నుంచి 16వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా బియ్యం, ఇతర నిత్యావసరాలను అందించాల్సి ఉంది. ఈ క్రమంలో డీలర్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. వారం రోజులపాటు సరుకులను పంచి తరువాత షాపులను క్లోజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వినియోగదారులు కచ్చితంగా బియ్యం కావాలని అడిగితే స్టాక్ అయిపోయిందని, కావాలంటే బియ్యానికి బదులుగా డబ్బులు తీసుకెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో డీలర్లు ఇచ్చే పదో, పదకొండుకో బియ్యాన్ని విక్రయించి వేలిముద్రలు వేసి వెళ్లిపోతున్నారు.
తనిఖీలకు వెళ్లని అధికారులు
జిల్లాలో దాదాపు 1233 రేషన్ షాపులు ఉన్నాయి. ఇందులో కర్నూలు నగరంలోనే 160 షాపులు ఉన్నాయి. అయితే రేషన్ షాపుల్లో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి పౌర సరఫరాల అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంది. అయితే వారు పట్టించుకోవడంలేదు. దీంతో డీలర్లు వారం మాత్రమే బియ్యం, ఇతర సరుకులను ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా వినియోగడారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ సరుకులను ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 12 గంటలు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు అందుబాటులో ఉండి సరఫరా చేయాలి. అయితే ఎక్కడా అది జరగడంలేదు. కేవలం వారికి అనుకూలమైన సమయాల్లోనే వస్తుండడంతో వినియోగదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
టీడీపీ నేతలకు వాటాలు!
బియ్యం అక్రమ దందాలో విస్తుపోయే నిజాలు దాగి ఉన్నాయి. వినియోగదారుడి నుంచి రేషన్ డీలరో లేదా ఇళ్లిళ్లు తిరిగే వారు కేవలం రూ.10 నుంచి రూ.13లకు కొనుగోలు చేసి దానిపై రూ.9 నుంచి రూ.6 వరకు లాభం పెట్టుకొని సమీపంలో ఉండే వ్యాపారులకు రూ.19 ప్రకారం అమ్ముతారు. వారు దానిపై రూ.5 అదనంగా లాభం వేసుకొని రూ.24 విక్రయిస్తారు. వీరు దానిపై 10 లాభం వేసుకొని జిల్లా సరిహద్దులు దాటిస్తారు. అంటే జిల్లా సరిహద్దులు దాటేలోపు బియ్యం ధర రూ.34 చేరుకుంటుంది. ఎక్కడికక్కడే బియ్యం అధికారులు, టీడీపీ నేతలకు వాటాలు ఉంటాయి. ఫలితంగా ఎలాంటి ఇబ్బందులేకుండా చేరాల్సిన చోటుకు అక్రమ బియ్యం చేరిపోతూ ఉంటుంది. జిల్లా సరిహద్దులు దాటిన తరువాత మిల్లులు చేరుకొని అక్కడ సన్న బియ్యం మాదిరిగా తయారై 25 కేజీలు, 50 కేజీల ప్యాకెట్లుగా తయారై తిరిగి ప్రజల చెంతకే చేరుకుంటుంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వినియోగదారుల ఇళ్ల దగ్గరకే వెళ్లి సరుకులను ఇచ్చేవారు. ఇందుకోసం 409 ఎండీయూ వాహనాల ద్వారా సరుకులను సరఫరా చేసేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వాటిని తీసి వేయడంతో పేదలు మళ్లీ రేషన్ షాపుల వద్ద ఎదురు చూడాల్సివస్తోంది. అక్కడికి వెళ్లితే వారు చెప్పినట్లు వినికపోతే అస్సలు సరుకులే వేయరు. ఈ క్రమంలో ప్రజలు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే సరుకుల పంపిణీ బాగుండేదని, ఇప్పుడు డీలర్లు చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారానికే రేషన్ షాపులకు తాళాలు
బియ్యం లేవని చెబుతున్న డీలర్లు
తంబ్ వేసి డబ్బులు
తీసుకెళ్లాలని ఒత్తిళ్లు
చర్యలు తీసుకోని అధికారులు
కర్నూలులో దారుణ పరిస్థితులు
పేదలకు ‘ఏడు’పే మిగిలింది!


