వేసవిలో నీటి ఎద్దడి రానీయొద్దు
కర్నూలు(సెంట్రల్): వచ్చే వేసవిలో నీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో తుంగభద్ర డ్యామ్ నుంచి నీటి విడుదల, వినియోగంపై ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అధికారులతో గురవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్ నుంచి జనవరి 10వ తేదీ వరకు తాగు,సాగు కోసం నీటిని విడుదల చేయాలన్నారు. తదుపరి ఏప్రిల్‌లో తాగునీటి కోసం 15 రోజులు కాకుండా 30 రోజులపాటునీటిని విడుదల చేయాలన్నారు. కేవలం 15 రోజులే వదిలితే గుడేకల్ వరకు మాత్రమే నీరు వస్తుందని, 30 రోజులపాటు విడుదల చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చెరువులు, ఎస్‌ఎస్ ట్యాంకులను నింపుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీఎస్‌తో మాట్లాడుతానని చెప్పారు. వర్షాలు ఆలస్యమైన పక్షంలో జూలైలో మరోసారి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 10వతేదీలోపు జిల్లాలోని అన్ని చెరువులు, ఎస్‌ఎస్ ట్యాంకులను సంపూర్ణంగా నీటితో నింపాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.
పైపు లీకేజీలు లేకుండా చూసుకోవాలి
కర్నూలు కార్పొరేషన్‌లో నీటి ఎద్దడి రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మునిసిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పైపులు లీకేజీ లేకుండా చూసుకోవాలన్నారు. సుంకేసుల నుంచి కర్నూలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వరకు పైపులైన్ పనులను మార్చిలోపు పూర్తి చేయాలన్నారు. ఆదోని ఎస్‌ఎస్ ట్యాంకు ట్యాంకు మరమ్మతులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎస్‌ఈ పాండురంగయ్య, తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్, కర్నూలు మునిసిపల్ డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ వెంకటరమాణారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మనోహర్, జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మి పాల్గొన్నారు.


