టీడీపీకి ఎదురు దెబ్బ
● కో–ఆప్షన్ సభ్యుడి ఎన్నికలో వైఎస్సార్‌పీపీ జయకేతనం
దొర్నిపాడు: మండల కో–ఆప్షన్ సభ్యుడి ఎన్నికలో అధికార పార్టీ టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అచ్చుకట్ల షఫీబాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ గోవిందనాయక్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దొర్నిపాడు మండల ప్రజాపరిత్ కార్యాలయంలో గురువారం ఈ ఎన్నిక ఉత్కంఠంగా సాగింది. కోఆప్షన్ సభ్యుడు అచ్చుకల్ల అల్లా మహమ్మద్ మృతిచెందడంతో ఈ ఎన్నిక నిర్వహించారు. మృతుడి కుమారుడు అచ్చుకట్ల షఫీబాషాకు వైఎస్సార్‌సీపీ పోటీ చేసే అవకాశం ఇచ్చింది. టీడీపీ అభ్యర్థులు దొర్నిపాడుకు చెందిన మాబుహుసేన్, చాకరాజువేముల గ్రామానికి చెందిన నొస్సం హుసేన్‌బాషాలు రెండు నామినేషన్లు వేశారు. వారు తప్పుగా సంతకాలు చేయడంతో నామినేషన్లను పీఓ తిరష్కరించారు. దీంతో అధికారులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అచ్చుకట్ల షఫీబాషా గెలుపును ఏకగ్రీవంగా ప్రకటిస్తూ డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.


