
ఆలనాపాలనా లేకుండా శిథిలమైన ఆ భవనం భూత్‌బంగ్లాను తలపించి భయపెడుతుంది. ఎవరూ పట్టించుకోని ఈ భవనం ఒకప్పుడు కష్టాల్లో ఉన్న ఎంతోమంది అమ్మాయిలను పట్టించుకుంది. ఆశ్రయమిచ్చి దారి చూపింది.
మద్రాస్‌కు చెందిన వైద్యురాలు, సంఘసంస్కర్త, రచయిత్రి, బ్రిటిష్ ఇండియాలో తొలి మహిళా శాసనసభ్యురాలైన డా. ముత్తులక్ష్మికి చెందిన ఆ విశాలమైన ఇల్లు ఎంతోమంది పేదింటి అమ్మాయిలకు నీడను ఇచ్చింది. ఆ ఇంట్లో ఆశ్రయం పొంది చదువుకున్న అమ్మాయిలు నర్స్‌లు, టీచర్‌లు అయ్యారు. 1942లో అడయార్ నది దగ్గర బ్రిటిష్ సైనికులు క్యాంప్ వేశారు. వారు తన
ఇంట్లో ఉంటున్న అమ్మాయిలను వేధిస్తున్నారనే విషయం తెలిసి చేతిలో దుడ్డు కర్రతో పహారా కాసేది ముత్తులక్ష్మి. అంతేకాదు స్థానిక బ్రిటిష్ కమాండెంట్ దగ్గరకు వెళ్లి....‘మా అమ్మాయిలకు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత మీదే’ అని హెచ్చరించింది.
తాజా విషయానికి వస్తే....
మహిళలకు డా. ముత్తులక్ష్మి చేసిన సేవలు, ఇచ్చిన స్ఫూర్తికి చిహ్నంగా ఆ ఇంటిని పునురుద్ధరించి స్మారకకేంద్రంగా మార్చనున్నారు. ఉచిత వైద్యసేవలు అందించే కేంద్రంగా, మహిళలకు వివిధ వృత్తులలో శిక్షణ ఇచ్చే కేంద్రంగా ఈ ఇంటిని తీర్చిదిద్దనున్నారు. లైబ్రరీ ఏర్పాటు చేయనున్నారు. ‘ది రిమార్కబుల్ టేల్ ఆఫ్ డా.ముత్తులక్ష్మి’ పేరుతో ముత్తులక్ష్మి జీవితచరిత్ర రాసింది వీఆర్ దేవిక.