
ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత ఖరీదైన ప్యాలెస్ అంటే ఎక్కడో విదేశాల్లో ఉంటుందనుకుంటారు. కానీ మనదేశంలోనే అలాంటి ప్యాలెస్ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసంగా గుర్తింపు పొందిన లక్ష్మీ విలాస్ ప్యాలెస్ గుజరాత్‌లోని వడోదర నగరంలో 30.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో విరాజిల్లుతోంది. ఇది లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే 36 రెట్లు పెద్దది. దీని విలువ రూ. 24,000 కోట్లని అంచనా.
ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ అనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిజైన్, ఇంటీరియర్, ఆర్కిటెక్చర్ పత్రిక తమ మిడిల్ ఈస్ట్ తాజా ఎడిషన్‌లో భారత్‌లోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ను పాఠకులకు పరిచయం చేసింది. ప్యాలెస్ లోపలి అద్భుత దృశ్యాలను చూపించింది. ‘ఇది మా ఇల్లు.. అయినా భారత ప్రజలదే’ అంటూ మహారాణి రాధికారాజే గైక్వాడ్ ప్యాలెస్ విశిష్టతను, విశేషాలను వివరించారు.

1890లో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ ప్యాలెస్, గైక్వాడ్ రాజవంశానికి వారసత్వ నివాస భవనంగా నిలిచింది. భారతీయ శిల్పకళను పాశ్చాత్య శైలితో కలిపిన ఈ నిర్మాణం, అప్పట్లోనే విద్యుత్, ఎలివేటర్లు, శీతలీకరణ వ్యవస్థలతో ఆధునికతకు నిదర్శనంగా నిలిచింది.

ప్యాలెస్‌లోని అంతర్గత అలంకరణలు, ఇస్లామిక్ గోపురాలు, హిందూ శిల్పాలు, బెల్జియం చందమామలు, ఇటాలియన్ మోసాయిక్‌లు, ప్రపంచ సంస్కృతుల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తాయి. రాజా రవి వర్మ చిత్రకళలకు ఇది నిలయంగా ఉంది.
రాజు ప్రజలకు దర్శనమిచ్చే ఇక్కడి దర్బార్ హాల్‌ను వెనిస్ ఫ్లోర్‌లు, స్టెయిన్‌డ్ గ్లాస్‌లతో తీర్చిదిద్దారు. అలంకరించబడింది. ఇది భారతీయ మరియు పాశ్చాత్య కళల కలయికకు నిదర్శనంగా నిలుస్తుంది.

ప్రస్తుతం ఈ ప్యాలెస్‌లో మహారాజా సమర్జిత్‌సింగ్ గైక్వాడ్, మహారాణి రాధికారాజే గైక్వాడ్, వారి కుమార్తెలు పద్మజారాజే, నారాయణిరాజే, రాణి తల్లి శుభంగినిరాజే నివసిస్తున్నారు. “ఇది ఒక గృహం మాత్రమే కాదు, మా కుటుంబానికి ఆత్మీయతను కలిగించే నివాసం,” అని మహారాణి రాధికారాజే పేర్కొన్నారు.