
బెంగళూరు రోడ్ల దుస్థితిపై జాతీయ వ్యాప్తంగా మీడియాలో వస్తున్న కథనాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తోందని అన్నారాయన. అంతేకాదు.. రోడ్లు బాగోలేకపోవడం అనేది ఓ జాతీయ సమస్య అని పేర్కొన్నారు.
అధ్వాన్నంగా ఉన్న బెంగళూరు రోడ్లకు మరమ్మత్తులు చేసే పనులు కొనసాగుతున్నాయని సోమవారం శివకుమార్ తెలిపారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్షేత్రస్థాయి సిబ్బంది అదే పనిలో ఉన్నారని తెలియజేశారు. ఈ క్రమంలో మీడియాలో వరుసగా వస్తున్న కథనాలపైనా కాస్త ఘాటుగా స్పందించారు.
‘‘నిన్న(ఆదివారం) నేను ఢిల్లీలో పర్యటించాను. ప్రధాని నివాసం రోడ్డులో వెళ్తున్నప్పుడు పెద్ద గుంతలు కనిపించాయి. మరి వాటిని ఏ మీడియా అయినా చూపిస్తోందా?. గుంతల రోడ్లు అనేది బెంగళూరుకే పరిమితం కాలేదు. ఇదొక జాతీయ సమస్య. కానీ, మీడియా కేవలం బెంగళూరునే లక్ష్యంగా చేసుకుంది.. ఎందుకు?. గత బీజేపీ ప్రభుత్వం ఆ పని సక్రమంగా చేసి ఉంటే.. బెంగళూరుకు ఇవాళ ఈ దుస్థితి ఏర్పడేది కాదు కదా. అయినా మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలోనే ఉంది’’ అని అన్నారాయన.
అలాగే ఐటీ కంపెనీలను ఉద్దేశించి.. ‘‘రోడ్ల మీద గుంతలు ఏర్పడడం ఎక్కడైనా సహజమే. వాటిని బాగు చేసే పనిలో మా ప్రభుత్వం ఉంది. ఇలాంటి సమస్యలు.. అలాగే బాగు చేసే వ్యవస్థలు దేశం మొత్తం ఉన్నాయి. కంపెనీలు ఈ విషయం గుర్తిస్తే మంచిది’’ అని డీకే అన్నారు.
ఇదిలా ఉంటే.. బ్లాక్‌బక్ అనే కంపెనీ బెంగళూరు ఓఆర్‌ఆర్ ప్రాంతం నుంచి నగరంలోనే మరొక చోటుకి తరలిపోయింది. అయితే గుంతల రోడ్ల వల్లే కంపెనీ నగరాన్ని వీడిపోయిందంటూ ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంతో.. ఐటీ హబ్ కాస్త గుంతల నగరంగా మారిందంటూ జేడీఎస్ అధినేత, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ విమర్శల నేపథ్యంలో.. ఐటీ కంపెనీలు తరలిపోతాయనే ఆందోళనలపై శివకుమార్ స్పందించారు. ఒకవేళ కంపెనీలు అలా బ్లాక్‌మెయిల్‌కు దిగినా.. బెదిరించినా.. తాము పెద్దగా పట్టించుకోమని అన్నారాయన. బెంగళూరు అనేది టాలెంట్‌కు భాండాగారంగా ఉందని, పాతిక లక్షల మంది ఇంజినీర్లతో, రెండు లక్షలకు పైగా విదేశీ నిపుణులతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడం ఆపబోదని అన్నారాయన. ఇదిలా ఉంటే.. బెంగళూరు రోడ్ల మరమ్మత్తులకు రూ.1,100 కోట్లను కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కాంట్రాక్టర్లకు నవంబర్ డెడ్‌లైన్‌గా విధించింది.
ఇదీ చదవండి: రోడ్లేమో ఇలా.. మరి ప్రయాణం ఎలా?