
రోడ్లు ఇలా.. ప్రయాణం ఎలా?
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండల కేంద్రం నుంచి కళ్యాణి గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలలో నీళ్లు నిండి అవి మరింత పెద్దవిగా మారాయని, ఈ గుంతలలో పడి ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతల కారణంగా ఆటోలు, బైక్‌లు తరుచూ చెడి పోతున్నాయని, దీని వల్ల కష్టపడి సంపాదించిన డబ్బులు ఆటోల రిపేర్లకు పెట్టాల్సి వస్తుందని ఆటోల యజమానులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్లపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
నిజామాబాద్ సిటీ: తెలుగు భాషోపాధ్యాయుడు, ప్రముఖ పుస్తక రచయిత, సిర్పూర్ జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు కాళోజీ జాతీయ పురస్కారం అందుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో నరేశ్‌రావుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, తెరసం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకర్ అవార్డు అందజేశారు. జిల్లాకు చెందిన మరో కవి చందన్‌రావుకు డాక్టర్ సినారె అవార్డు అందుకున్నారు.
రుద్రూర్: రుద్రూర్ ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన కేంద్రం అధిపతిగా డా. పవన్ చంద్రారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2007 నుండి 2013 వరకు రుద్రూర్ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా సేవలందించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఏరువాక కేంద్రానికి బదిలీపై వెళ్లారు. 2017 వరకు ఏరువాక కేంద్రం అధిపతిగా పనిచేశారు. రుద్రూర్ పరిశోధన కేంద్రంలో ఆరు నెలలపాటు పదోన్నతిపై సీనియర్ శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తించారు. 2018 నుంచి 2023 వరకు రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌గా, 2023 నుంచి 2025 వరకు హైదరాబాద్‌లోని నేల ఆరోగ్య యాజమాన్య సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేశారు. రుద్రూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ చంద్రారెడ్డిని బోధన, బోధనేతర సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

రోడ్లు ఇలా.. ప్రయాణం ఎలా?