యువతకు స్ఫూర్తినిచ్చే ఆత్మకథ
● ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం
● రెరా చైర్మన్ ఎన్.సత్యనారాయణ
● కుంచె గీసిన బతుకు చిత్రాన్ని
ఆవిష్కరించిన నందిని సిధారెడ్డి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘తన జీవన ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కసితో చదివి ఉన్నత స్థితికి ఎదిగిన డాక్టర్ వి.శంకర్ జీవితం స్ఫూర్తిమంతమైనది. నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న యువతకు మేల్కొలుపులా కుంచె గీసిన బతుకు చిత్రం పుస్తకం ఉపయోగపడుతుంది’ అని రెరా చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ ఎన్.సత్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి, అసోసియేట్ ప్రొఫెస ర్ వి.శంకర్ తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, అధిగమించిన మైలురాళ్లన్నింటినీ కలిపి ‘కుంచె గీసిన బతుకు చిత్రం’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీలో ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించగా, డాక్టర్ నాళేశ్వరం శంకరం సమీక్షించారు. ఈ సందర్భంగా రెరా చైర్మన్ మాట్లాడుతూ శంకర్ తన జీవన ప్రయాణంలో ఎదుర్కొ న్న సవాళ్లను ఎంతో నిజాయితీగా అక్షరీకరించారన్నారు. సమాజానికి దిశానిర్దేశం చేసేలా పుస్తకం ఉందన్నారు. తెలంగాణ సామాజిక చిత్రంతో పా టు ఒక అధ్యాపకుడి అంతర్మథనాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తుందని నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యంవైపు నడవడానికి ఈ పుస్తకం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. కుంచె గీసిన బతుకుచిత్రం అనే పేరులోనే ఒక కళాత్మకత ఉందని, ఒక చిత్రకారుడు తన జీవితాన్ని రంగులతో కాకుండా అక్షరాలతో ఎలా తీర్చిదిద్దారో ఈ శీర్షక సూచిస్తుందని నాళేశ్వరం శంకరం అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య, తెలుగు విభాగ ప్రతినిధులు విశ్వప్రసాద్, రవీంద్రనాథ్, ఉమామహేశ్వరి, ఎన్‌సీసీ కోఆర్డినేటర్లు సుధాకర్, శ్రీనివాస్‌రావ్, కవులు సూరారం శంకర్, సిరిగాద శంకర్, సత్యనారాయణ, అశోక్‌కుమార్, ప్రకాశ్, నర్సింహారెడ్డి, నాంపల్లి, ఉస్మాన్, శ్రీనివాస్, భోజిరెడ్డి పాల్గొన్నారు.


