పెట్టుబడులు వస్తుండటంతో కేసీఆర్‌కు భయం పట్టుకుంది
తోలు వలుస్తామంటే ఇక్కడెవరూ ఖాళీగా లేరు: డిప్యూటీ సీఎం భట్టి
సత్తుపల్లి/తల్లాడ: రెండేళ్లు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి దిగజారుడు భాషతో తమ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రూ. 10.53 కోట్ల వ్యయంతో నిర్మించే మూడు సబ్‌స్టేషన్లకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే సత్తుపల్లిలో సింగరేణి ఏరియా జీఎం కార్యాలయాన్ని ప్రారంభించి ఆయా కార్యక్రమాల్లో మాట్లాడారు. ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందునే 85 శాతం సర్పంచ్‌లుగా తమ పార్టీ బలపరిచిన వారిని గెలిపించారన్నారు.
దిగజారి మాట్లాడటం తమకు రాదని.. ప్రజాసంక్షేమ కార్యక్రమాల ద్వారానే బీఆర్‌ఎస్ నేతలకు బుద్ధి చెబుతామన్నారు. ‘రెండేళ్లు ఫాంహౌస్‌లో పడుకున్న ఒకాయన మీడియా ముందుకొచ్చి తోలుతీస్తాం అనడం సరికాదు. తోలు వలుస్తామంటే ఇక్కడ ఖాళీగా ఎవరూ లేరు. ఆయన తోలు వలిచే ఉద్యోగం ఎప్పుడు తీసుకున్నారో చెప్పాలి’అని భట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడమంటే భయమెందుకో కేసీఆర్ చెప్పాలన్న భట్టి.. ప్రతిపక్ష హోదా అవసరమా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు వస్తుంటే కనుమరుగవుతాననే భయంతో కేసీఆర్ తమ ప్రభుత్వంపై విషం కక్కి తిరిగి ఫాంహౌస్‌కు వెళ్లారని విమర్శించారు. కాగా, బొగ్గు ఉత్పత్తిలో ప్రైవేట్ సంస్థలతో సింగరేణి పోటీ పడుతూనే బహుముఖంగా ఎదిగేలా చర్యలు చేపట్టామని భట్టి వివరించారు. కాపర్, గోల్డ్ మైనింగ్‌లోనూ సింగరేణి అడుగుపెట్టిందని చెప్పారు.
కేంద్రం బొగ్గు బావులకు వేలం నిర్వహిస్తే తెలంగాణ నుంచి ఒక్క బొగ్గు బావి కూడా ఇతరులకు పోకుండా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ రాందాస్ నాయక్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, సీపీ సునీల్‌దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


