సాక్షి, హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా శనివారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. శాసనసభలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2026-27 ఏడాదికి ఏపీ బడ్జెట్ రూ.3,32,205 కోట్లుగా వెల్లడించారు. కాగా, పయ్యావుల కేశవ్ మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
అయితే, భారీగా ద్రవ్యలోటుతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేసింది. రూ.75,868 కోట్ల ద్రవ్యలోటును ప్రబుత్వం చూపించింది. అలాగే, రూ.22,000 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది కూడా భారీ అప్పులు చేయాలని నిర్ణయించింది. ఓపెన్ మార్కెట్ అప్పులు 76,182 కోట్లు చేయాలని, కేంద్రం నుండి 19,033 కోట్లు చేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 97వేల కోట్లు అప్పులు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఏపీని ఇప్పటికే అప్పుల్లో దేశంలో నెంబర్ వన్‌గా నిలిపారు.
ఇక, ఈసారి కూడా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు బడ్జెట్‌లో టోకరా వేసింది. నిరుద్యోగ భృతికి పైసా కూడా కేటాయించలేదు. ఆడబిడ్డ నిధి పథకానికి కూడా ఈసారి కేటాయింపులు చేయలేదు. మహిళలకు ఇచ్చిన హామీకి బడ్జెట్ కేటాయించని ప్రభుత్వం. ప్రతీ మహిళకు 1500 నెలకు ఇస్తామని మోసం చేసిన కూటమి ప్రభుత్వం. కొత్తగా ఒక్క పథకానికి కూడా నిధులు ఇవ్వకపోవడం గమనార్హం. అన్నదాత సుఖీభవకు కేవలం 6600 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారు. 54 లక్షల రైతు కుటుంబాలకు 20వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అరకొర కేటాయింపులతో అన్నదాతను మోసం చేస్తున్నారు. ధరల స్థిరీకరణకు కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి.
కేటాయింపులు ఇలా..
వైద్యశాఖ-19,306 కోట్లు
పంచాయతీరాజ్ శాఖ-22,941 కోట్లు
నీటి వనరుల శాఖ- 18,223 కోట్లు.
మున్సిపల్ శాఖ-14,523 కోట్లు.
పోలవరం-6,105
వ్యవసాయ శాఖ-11,745
పాఠశాల విద్య-32,308 కోట్లు.


