
ఈ భూమ్మీద ఏదీ శాశ్వతం కావన్నాడు ఓ కవి. ప్రభుత్వాలు, పదవులు, ఘనతలు, రికార్డులు.. రోజులు, ఏండ్లు దొర్లే కొద్దీ కొత్తదనానికి అనుగుణంగా మార్పునకు లోనవుతుంటాయి. A23a విషయంలోనూ ఇప్పుడు అదే జరిగింది. ఆరు ముంబై మహానగరాలు కలిస్తే ఎలా ఉంటుందో.. ఆ సైజులో ఉండి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఈ ఐస్‌బర్గ్ హఠాత్తుగా ముక్కలైంది.
అంటార్కిటికా ఫ్లిచెనర్ రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి 1986 ఆగష్టులో విడిపోయింది. అప్పటి నుంచి 34 ఏళ్లుగా అక్కడే స్థిరంగా ఉండిపోయింది. అయితే 2020 నుంచి వెడ్డెల్ సముద్రం పశ్చిమం వైపు అది నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. కిందటి ఏడాది జనవరిలో అది సుడిగుండంలో చిక్కుపోయింది. అయితే అనూహ్యంగా డిసెంబర్ మధ్యలో అది అక్కడి నుంచి బయటపడింది.
బలమైన గాలుల ప్రభావమే దాన్ని అక్కడి నుంచి బయటపడేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అటుపై యూఎస్ నేషనల్ ఐస్ సెంటర్ దీనిని ఈ భూమ్మీద అతిపెద్ద ఐస్‌బర్గ్🧊గా ప్రకటించింది. ఒక చిన్న ద్వీపం పరిమాణంలో ఉండి, ట్రిలియన్ టన్నుల బరువుతో.. ప్రపంచంలో నీటిపై తేలియాడుతూ అతిపెద్ద మెగా ఐస్‌బర్గ్‌గా గుర్తింపు దక్కించుకుంది.

ఆ టైంలో సుమారు 4వేల స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ఐస్‌బర్గ్.. బ్రిటీష్ సరిహద్దుల వైపు ప్రయాణించడాన్ని శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనించారు. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న సౌత్ జార్జియాను అది ఢీ కొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇది ముక్కలైనట్లు సైంటిస్టులు గురువారం ప్రకటించారు. రాబోయే మరికొన్ని వారాల్లో అది మరిన్ని ముక్కలు కావొచ్చని చెబుతున్నారు.
మెగా టైటిల్ దానికే..
A23A ముక్కలు కావడంతో మెగా ఐస్‌బర్గ్ టైటిల్ కోల్పోయింది. అమెరికాలోని రోడ్ ఐల్యాండ్ స్టేట్ పరిమాణంలో ఉండేది.. ఇప్పుడు టెక్సాస్ స్టేట్‌లోని హ్యూస్టన్ పరిమాణానికి పడిపోయింది. దాని ముక్కలకు.. ఏ23డీ, ఏ23ఈ గా నామకరణం చేశారు. దీంతో.. బ్రిటన్ డీ15ఏ ప్రపంచంలోని అతిపెద్ద ఐస్‌బర్గ్ ఘనతను సొంతం చేసుకుంది.

D15A ఐస్‌బర్గ్ అనేది అంటార్కిటికాలోని అమేరీ ఐస్ సెల్ఫ్ Amery Ice Shelf నుంచి విడిపోయిన భారీ మంచు పర్వతం. ఇది మొదటగా D15 అనే పేరుతో గుర్తించబడింది, కానీ 2016లో ఇది రెండు భాగాలుగా విడిపోయింది. ఇందులో D15A అతిపెద్ద భాగం. D15B అతి చిన్న భాగం. D15A పరిమాణం.. పొడవు: 51 నాటికల్ మైళ్ళు, వెడల్పు: 24 నాటికల్ మైళ్ళు. ఇది సుమారు 3,000 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది. అంటే గోవా రాష్ట్రం అంత పరిమాణం. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. D15A స్థిరంగా ఉన్నప్పటికీ, వాతావరణ మార్పులు, సముద్రపు వేడి నీరు, మరియు అలల ప్రభావం వల్ల దీని భవిష్యత్తు కూడా అనిశ్చితంగా ఉంది.
A68a గురించి..
ఏ68ఏ.. A23a కంటే ముందు ప్రపంచంలో మెగా ఐస్‌బర్గ్‌గా రికార్డుల్లో నమోదైంది. పరిమాణంలో లండన్ నగరం కంటే మూడు రెట్లు పెద్దది. బరువు ఒక ట్రిలియన్ టన్నులుగా ఉండేదని అంచనా. ఇది కూడా సౌత్ జార్జియాను ఢీ కొట్టవచ్చని అప్పట్లో ఆందోళన చెందారు. అయితే.. ఐల్యాండ్‌కు సరిగ్గా వంద మైళ్ల దూరంలో ఉండగానే దానికి భారీగా డ్యామేజ్ అయ్యింది. ఆపై అది సముద్రంలోనే కరిగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఏం జరగొచ్చు?
ఏ23ఏ ముక్కలు కావడం అనేది కొత్త విషయం ఏం కాదని.. అదే సమయంలో ఆసక్తికరమైన అంశమేనని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన శాస్త్రవేత్త టెడ్ స్కాంబోస్ చెబుతున్నారు. తుపానులు, అలలు A23A అనే భారీ హిమపర్వతాన్ని బలహీనపరిచాయని, దాని లోపల ఉన్న చీలికలను బయటపెడుతూ వచ్చిందని అంటున్నారు. ఇక.. మీజర్స్ అనే మరో శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం.. త్వరలోనే ఇదిట్రాక్ కూడా చేయలేనంత చిన్న ముక్కలు కావొచ్చని అంటున్నారు. అయితే..

వేసవి ముగిసే దాకా ఆ A23A ముక్కలు అలాగే ఉంటే మాత్రం.. ముప్పు తప్పదని స్కాంబోస్ అంటున్నారు. వేడి నీరు కారణంగా ఒక్క రోజులోనే అది మంచు పర్వతం కుప్పకూలినట్లుగా విరిగిపోవచ్చు అని చెప్పారాయన. ఇదిలా ఉంటే.. మంచుపర్వతాలు విరిగిపోవడం వల్ల నేరుగా సముద్ర మట్టం పెరగదు. కానీ ఐస్ షెల్ఫ్‌లు చిన్నవిగా మారితే.. భూభాగంపై ఉన్న మంచు వేగంగా కరిగి సముద్రంలో కలిసే అవకాశం ఉంటుంది, ఇది సముద్ర మట్టం పెరగడానికి కారణమవుతుంది.