మోనాలిసాతో మొదలై.. ప్రపంచంలోనే భారీ చోరీ ఏదో తెలుసా? | World Most Expensive Heist, All You Know About France Lovure Museum And The Mystery Of Art Theft | Sakshi
Sakshi News home page

మోనాలిసాతో మొదలై.. ప్రపంచంలోనే భారీ చోరీ ఏదో తెలుసా?

Oct 20 2025 11:56 AM | Updated on Oct 20 2025 1:25 PM

World Most Expensive Heist: All You Know about France lovure Museum Others Details

మిస్టరీతో కూడిన చిరునవ్వు మోనాలిసా.. లియోనార్డో డా విన్సీ చిత్రించిన 16వ శతాబ్దం నాటి అపురూపమైన పెయింటింగ్. అలాంటి దానిని వందల మంది కాపాలా కాసే చోటు నుంచి దానిని దొంగలించడం సాధ్యమేనా?.. తాజాగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన లూవ్ర్ మ్యూజియంలో జరిగిన చోరీని చూస్తే.. ‘అదేం పెద్ద విషయం కాకపోవచ్చు’ అనే సందేశాన్ని ఇస్తోంది.

లూవ్ర్ మ్యూజియం.. 12వ శతాబ్దంలో ఇదొక కోట. తర్వాతి కాలంలో.. ఫ్రాన్స్‌ రాజులు దీనిని రాజభవనంగా మార్చేశారు. అయితే.. లూయీ XIV తన రాజభవనాన్ని వెర్సైల్లెస్‌కు మార్చారు. అప్పటి నుంచి కళాత్మక ప్రదర్శనలు ఉంచే చోటుగా మారిపోయింది. 1793లో ఫ్రెంచ్ విప్లవం అనంతరం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. Musée du Louvre అనే పేరుతో 18వ శతాబ్దం నుంచి దీనికి అధికారిక మ్యూజియం గుర్తింపు దక్కింది. 

ప్రస్తుతం Louvre museum ప్రపంచంలోనే అతిపెద్ద, సుప్రసిద్ధ కళా మ్యూజియం. మెసపటోమియా, ఈజిప్టు.. అనేక నాగరికతలకు చెందిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. గ్రీకు, రోమన్, ఫ్రెంచ్ రాజ్యాలకు చెందిన ప్రతీకలు ఇక్కడ కొలువు దీరాయి. మోనాలిసా, వీనస్ డి మిలో, వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోత్రేస్ వంటి కళాఖండాలు లూవ్ర్‌కు ప్రత్యేక ఆకర్షణ.   గాజు పిరమిడ్‌ షేపులో ఉండే మ్యూజియం ఎంట్రెన్స్‌ అదనపు ఆకర్షణ. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ఏఐ పై డిజైన్‌ చేసిన ఈ ద్వారం 1989లో నిర్మించబడింది. పారిస్ నగరానికి ఆధునికతను చేర్చే చిహ్నంగా.. పిరమిడ్ 21.6 మీటర్ల ఎత్తు, 673 గాజు పలకలతో రూపొందించారు. అరోజుకు సగటున 30,000 మంది సందర్శకులు.. ఏటా దాదాపు కోటి మంది దీనిని సందర్శిస్తుంటారు. అందుకే భద్రతా కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ..  

2025 అక్టోబర్ 19న లూవ్ర్ మ్యూజియంలో భారీ దోపిడీ జరిగింది. ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్ విభాగం అపోలో గ్యాలరీలో నెపోలియన్ చక్రవర్తి కాలంనాటి విలువైన ఆభరణాలను నలుగురు దుండగులు దొంగలించారు. మోటార్ స్కూటర్లపై వచ్చిన దొంగలు.. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మ్యూజియం లోపలికి వెనకభాగం నుంచి చొరబడి(సీన్‌ నది వైపు).. సరుకు రవాణా ఎలివేటర్ ద్వారా గ్యాలరీలోకి ప్రవేశించారు. కట్టర్లు ఉపయోగించి రెండు డిస్‌ప్లే కేసులను ధ్వంసం చేశారు. అద్దాలను పగలగొట్టి తొమ్మిది విలువైన వస్తువులను అపహరించారు. కేవలం నాలుగు నుంచి ఏడు నిమిషాల వ్యవధిలోనే ఈ హైప్రొఫైల్‌ చోరీ జరిగింది. 

ఫ్రాన్స్ కల్చర్ మినిస్టర్ రాచిడా దాతి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. చోరీకి గురైన 9 వస్తువుల్లో నెపోలియన్‌ చక్రవర్తికి చెందిన తలపాగా..  ముత్యాల హారంతో పాటు ఫ్రాన్స్‌ చివరి మహారాణి యూజెనీ(నెపోలియన్‌-3 సతీమణి) ముత్యాల హారం కూడా ఉందని ప్రకటించారామె. అయితే.. తొమ్మిది నగల్లో.. ఒకటి అక్కడే పడిపోయిందని, దానిని తిరిగి భద్రపరిచినట్లు చెప్పారు. వీటి విలువ వెలకట్టలేనిదని తెలుస్తోంది. ఈ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు.. చోరీ నేపథ్యంలో మ్యూజియాన్ని తాత్కాలికంగా మూసివేశారు. 

అలాగని వరల్డ్‌ ఫేమస్‌ అయిన లూవ్ర్ చరిత్రలో ఇదే మొదటి దోపిడేం కాదు. 1911లో సుప్రిసిద్ధ మోనా లిసా చిత్రాన్ని మ్యూజియంలో పని చేసిన విన్సెంజో పెరుగ్గియా అనే ఇటాలియన్ కార్మికుడు దొంగలించాడు. అతని అరెస్ట్‌తో రెండు సంవత్సరాల తర్వాత అది తిరిగి లభించింది. 1976లో గుస్తావ్ కుర్బెట్ ‘ది వేవ్’ చోరీకి గురైనా.. ఇప్పటికీ దొరకలేదు. 1983లో రెండు పురాతన కవచాలను దొంగలించగా.. 40 ఏళ్ల తర్వాత తర్వాత అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. చివరగా.. 1998లో Le Chemin de Sèvres అనే పెయింటింగ్ చోరికి గురై ఆ ఆచూకీ ఇప్పటిదాకా లభ్యం కాలేదు. 

లె చెమిన్‌ చోరీ తర్వాత లూవ్ర్ మ్యూజియంలో భద్రతను భారీగా పెంచారు. అయినా కూడా ఇలా జరగడం తీవ్ర చర్చనీయాంగా మారింది. అక్కడ చోరీ జరిగితే అది అసలు దొరకదని, దొరికినా అసంపూర్తిగా ఉంటుందనే మచ్చ ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో తాజా చోరీ కేసులో అయినా పురోగతి ఉంటుందేమో చూడాలి.

ప్రపంచంలోనే అత్యంత విలువైన చోరీ ఏదో తెలుసా?..  
అమెరికా బోస్టన్‌ ఇసబెల్లా స్టువర్ట్ గార్డ్నర్ మ్యూజియంలో (Isabella Stewart Gardner Museum Heist) జరిగిన చోరీ.. చరిత్రలోనే అత్యంత విలువైన కళా దొంగతనంగా గుర్తించబడింది. అప్పటి అంచనా ప్రకారం చోరీకి గురైన కళాకృతుల విలువ రూ.500 మిలియన్‌ డాలర్లు. ఆనాడు ఏం జరిగిందంటే.. 

1990 మార్చి 18వ తేదీన ఇద్దరు వ్యక్తులు పోలీసుల వేషంలో మ్యూజియంకు వచ్చారు. డిస్టర్బెన్స్ కాల్ ఉందని చెబుతూ లోపలికి వెళ్లి.. భద్రతా సిబ్బందిని గంటపాటు బంధించి తమ పని కానిచ్చారు. మొత్తం 13 కళా వస్తువులను దొంగిలించగా.. అందులో రెంబ్రాంట్‌, వెర్మీర్‌, డెగా.. లాంటి పాపులర్‌ పెయింటింగ్స్‌ ఉన్నాయి. ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్‌ రంగంలోకి దిగినా.. దొంగల ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. ఈ కేసుకు సంబంధించి 10 మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ మ్యూజియంలో అవి దొరకకపోతాయా? అనే ఆశతో ఖాళీ ఫ్రేమ్‌లను వేలాడదీయడం చూడొచ్చు. 

అలాగే.. అంట్వెర్ప్ డైమండ్ హైస్ట్ (2003, బెల్జియం)లో.. సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాలు, బంగారం దొంగిలించారు. అందుకే దీనిని ఈ శతాబ్దపు భారీ చోరీ "Heist of the Century" అని పిలుస్తారు. హ్యారీ విన్‌స్టన్ జువెల్ రాబరీ (2008, పారిస్).. 108 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఈ చోరీలో దొంగలు మహిళల వేషంలో వచ్చారు. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ హైస్ట్ (2003).. సద్దాం హుస్సేన్ పాలనలో 1 బిలియన్ డాలర్ల నగదు కొట్టేసినట్లు ఒక అంచనా. ఇలా.. లూవ్ర్‌ చోరీ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన దొంగతనాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

ఇదీ చదవండి: స్కాండల్స్‌తో రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement