వ్యవసాయ శాస్త్రవేత్తకు సైబర్ నేరగాళ్ల టోకరా
నెల్లూరు (క్రైమ్): సీబీఐ అధికారుల పేరిట ఓ వ్యక్తిని డిజిటల్ అరెస్టు అంటూ భయభ్రాంతులకు గురిచేసిన సైబర్ నేరగాళ్లు అతని నుంచి రూ.23 లక్షలు కొల్లగొట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు రూరల్ మండలంలో వ్యవసాయ పరిశో«ధన శాస్త్రవేత్త ఉంటున్నారు. ఆయనకు ఈ నెల 17న బెంగళూరు అశోక్‌నగర్ పోలీసుస్టేషన్ సీఐని అంటూ ఓ వ్యక్తి ఫోన్‌చేసి మహిళలకు అసభ్యకర ఫొటోలు పంపుతున్నట్లు కేసు నమోదైందని చెప్పాడు. సీబీఐ అధికారులతో మాట్లాడుతున్నట్లు వీడియో కాల్‌లో చూపించి ఆధార్ నంబర్ ఆధారంగా అరెస్టు వారెంట్ జారీ అయిందని భయపెట్టాడు.
18న సీబీఐ అ«ధికారి దయానాయక్ అనే వ్యక్తి ఫోన్‌చేసి మాట్లాడాడు. సబాత్‌ఖాన్ అనే నేరస్తుడు ఇచ్చిన వాంగ్మూలంలో మీ పేరు ఉందని, సుప్రీంకోర్టులో కేసు ఉందని భయపెట్టారు. నిర్దోషి అని నిరూపించుకోవాలంటే తక్షణమే సుప్రీంకోర్టు రిజర్వ్ ఫండ్‌కు రూ.30 లక్షలు డిపాజిట్ చేయాలంటూ శాస్త్రవేత్తను ఒత్తిడికి గురిచేశారు. రెండ్రోజుల పాటు డిజిటల్ అరెస్టుచేసి అతని నుంచి రూ.23,00,117 నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు 1930కు ఫిర్యాదు చేశారు. అలాగే, వేదాయపాళెం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


