సిలికాన్ సిటీలో పట్టపగలే కోట్ల రూపాయల నగదును సినిమా స్టైల్లో దొంగలు దోచుకున్నారు. ఏటీఎంలలో నగదు నింపడానికి వెళ్తున్న ఏజెన్సీ వాహనాన్ని అడ్డగించి.. తాము సెంట్రల్ ఏజెన్సీల అధికారలమంటూ సిబ్బంది బోల్తా కొట్టించారు. ఆపై కొంత దూరం తీసుకెళ్లి బెదిరించి నగదును లూటీ చేసి ఉడాయించారు.
బుధవారం (నవంబర్ 19న) మధ్యాహ్నం బెంగళూరులో సీఎంఎస్(క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్) వ్యాన్ నుంచి రూ. 7.11 కోట్ల భారీ దొంగతనం జరిగింది. జేపీ నగర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్ కరెన్సీ చెస్ట్ నుంచి నగదు తీసుకుని ఏటీఎంలలో నింపేందుకు వాహనం బయలుదేరింది. బండిలో కస్టోడియన్ అఫ్తాబ్, డ్రైవర్ బినోద్ కుమార్, గన్‌మెన్ రాజన్న, తమ్మయ్య ఉన్నారు.
వ్యాన్ అశోకా పిల్లర్ వద్దకు రాగానే ఓ వైట్‌కలర్ టయోటా ఇన్నోవా అడ్డగించింది. అందులోంచి ఐదారుగురు బయటికి దిగి.. తాము ఆర్‌బీఐ అధికారులమంటూ చెప్పారు. వాళ్ల అవతారాలు చూసి సిబ్బంది కూడా నిజమని నమ్మారు. సదరు సంస్థపై ఫిర్యాదు ఉందని.. ఆర్‌బీఐ విచారణ జరుపుతోందని.. తమ వెంట రావాలని ఒత్తిడి చేశారు. ఆ హఠాత్ పరిణామంతో ఏం చేయాలో పాలుపోక వాళ్లంతా ఆ వాహనంలోకి ఎక్కారు. అటుపై డెయిరీ సర్కిల్ వద్ద వ్యాన్ డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించి రూ. 7.11 కోట్ల నగదు తీసుకుని పరారయ్యారు.
Money Heist in Bengaluru
Robbers posing as Govt officials intercepted a CMS ATM cash loading vehicle allegedly claiming "verification", transferred about 7 crore into their Innova, left the staff & vehicle near a flyover, and escaped. A citywide search is underway. pic.twitter.com/sGb0IpgcXF— Deepak Bopanna (@dpkBopanna) November 19, 2025
ఈ ఘటనపై సీబీఐ కోర్టు పరిధిలోని సిద్ధాపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ స్వయంగా విచారణను పర్యవేక్షిస్తున్నారు. ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేసి, CCTV ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. అవల్లహళ్లి ప్రాంతంలో దుండగుల వాహనం చివరిసారిగా కనిపించింది, అక్కడి నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటన జరిగిన తీరు నేపథ్యంలో సీఎంఎస్ ఉద్యోగుల హస్తం కూడా ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇంత దర్జాగా దోచుకున్నది లోకల్ దొంగలా? ఉత్తరాది ముఠాలా? అసలెవరు?? అనేది ఉత్కంఠగా మారింది.
ప్రభుత్వం చచ్చిందా: అశోక్
ఈ దోపిడీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీజేపీ పక్ష నేత ఆర్ అశోక్ ఆరోపించారు. ట్రాఫిక్ జామ్ మధ్య, వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితిలో దోపిడీ చేశారంటే ఇది కచ్చితంగా బ్రాండ్ బెంగళూరే అని హేళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో ఉన్న ఖైదీలకు, టెర్రరిస్టులకు మొబైళ్లు ఏర్పాటు చేస్తున్నట్టే దోపిడీ దొంగలకు కూడా ఏర్పాట్లు చేశారని అనుమానాలు వస్తున్నాయన్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం, పోలీసు శాఖ ఉన్నా చచ్చినట్టే అనిపిస్తోందని దుయ్యబట్టారు. బ్యాంకు డబ్బులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో ఊహించవచ్చన్నారు.


