కన్నుల పండువగా సిద్దారూఢ జాతర
హుబ్లీ: ఉత్తర కర్ణాటకలోనే కాక మహారాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల ఆరాధ్య దైవం పాత హుబ్లీలో వెలసిన సిద్దారూఢ స్వామి రథోత్సవ వేడుకలు కన్నుల పండువగా ముగిశాయి. సుమారు రెండు రోజుల పాటు ప్రత్యేకమైన వంటకాలు, ముఖ్యంగా ఉదయం ఫలహారంలో లక్ష మంది సెట్ దోశలు, గులాబ్‌జామ్‌తో పాటు వివిధ రకాల వంటకాలను గత 10 రోజుల నుంచి భక్తులకు పంపిణీ చేశారు. ముఖ్యంగా సిద్దారూఢపై ఉన్న భక్తితో స్థానిక ఆటో డ్రైవర్లు, వాటి యజమానులు ఉచిత ఆటో సేవలు అందించారు. అలాగే పాదయాత్ర ద్వారా వచ్చే వారికి చల్లటి పానీయాలతో పాటు అలసిపోయిన కాళ్లకు నూనె మర్దనం వంటి సేవలు కూడా అందించారు. ఆటో డ్రైవర్ల యజమానుల సంఘం అధ్యక్షుడు శేఖరయ్య మఠపతి మాట్లాడుతూ గత 20 ఏళ్ల నుంచి తమ ఉచిత ఆటో సేవలు భక్తితో అందిస్తున్నామన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చేపట్టామన్నారు. అలాగే ఇతర భక్తులు కూడా తమ చేతనైన సేవలు అందించడం ద్వారా సిద్దారూఢపై తమ భక్తిప్రపత్తులను చాటారు.


