మీ అకౌంట్లు క్లోజ్ చేస్తున్నాం. అప్రమత్తం అవ్వండి.. అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అక్కడి మైనర్లకు నోటిఫికేషన్‌లు పంపిస్తున్నాయి. ఆస్ట్రేలియా డిసెంబర్ 10, 2025 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇలాంటి నిషేధం అమలు చేయడం సాధ్యమేనా? అనే అంశాన్ని ఓసారి పరిశీలిద్దాం..
పిల్లలు.. పిల్లలాగే ఉండనివ్వాలి అన్నది ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ చెబుతున్నమాట. సో.మీ. ప్రభావంతో పిల్లలు హానికరమైన కంటెంట్, ఆన్‌లైన్ బుల్లీయింగ్, మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని చెబుతోంది. ఆన్‌లైన్ సేఫ్టీ అమెండ్‌మెంట్(సోషల్ మీడియా మినిమమ్ ఏజ్) బిల్లు ప్రకారం.. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, యూట్యూబ్ కిడ్స్, ఈ లెర్నింగ్ యాప్‌లకు మాత్రం బ్యాన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే సో.మీ. యాప్‌లు ఈ బ్యాన్‌ను వ్యతిరేకించినప్పటికీ.. తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేయబోతున్నాయి.
మెటా.. దాని అనుబంధ యాప్‌లు, టిక్‌టాక్, యూట్యూబ్, ఎక్స్.. ఇలా ఎందులోనూ వాళ్లకు అకౌంట్లు ఉండడానికి వీల్లేదు. ఇప్పటికే మెయిల్స్, నోటిఫికేషన్ల రూపంలో మైనర్లకు సందేశాలు పంపిస్తున్నాయి. ఆ అకౌంట్లలో ఉన్న తమ డేటాను భద్రపరుచుకోవాలని వాళ్లకు సూచిస్తున్నాయి. నిర్ణీత వయసు దాటితే గనుక తమను తగిన ఆధారాలతో సంప్రదించాలని.. ఫేషియల్ ఏజ్ స్క్రీనింగ్ లాంటి సాంకేతిక సాయంతో ఆ విషయాన్ని ధృవీకరించుకుని ఆపై ఆ అకౌంట్లను యాక్టివేట్ చేస్తామని చెబుతున్నాయి.
పలు యాప్‌లు పిల్లల అకౌంట్లను డీ యాక్టివేట్ చేయడం ప్రారంభించాయి. డిసెంబర్ 4వ తేదీ నుంచే పిల్లలు అకౌంట్లను క్రియేట్ చేయడానికి వీలుండదు. 10వ తేదీ నుంచి సంపూర్ణ నిషేధం అమల్లోకి వస్తుంది. నిబంధనలను ఉల్లంఘిస్తే.. సదరు ప్లాట్‌ఫారమ్‌లకు 50 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లు(మన కరెన్సీలో రూ.2,856 కోట్లు) దాకా జరిమానా విధిస్తారు.
భారత్‌లో ఇది పరిస్థితి..
ఆస్ట్రేలియా ప్రపంచంలో ఈ తరహా బ్యాన్ తేబోతున్న దేశం. అలాగే.. డెన్మార్క్ వంటి దేశాలు వయస్సు ఆధారంగా సోషల్ మీడియా నిషేధం అమలును పరిశీలిస్తున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పలు చోట్ల ఈ తరహా నిషేధం అమలు అవుతోంది కూడా. ఈ నేపథ్యంలో.. భారతదేశంలో కూడా ఈ అంశంపై చర్చ మొదలైంది.
అయితే డిజిటల్ నిపుణులు చెబుతోంది ఏంటంటే.. నిషేధం అమలు చేయడం కష్టమని. ఎందుకంటే భారత్‌లో 25 కోట్ల మైనర్లు సో.మీ. వాడుతున్నారనే అంచనా ఒకటి ఉంది. అంతేకాదు.. భారతదేశంలో డిజిటల్ మానిటరింగ్ బలహీనంగా ఉందని. సోషల్ మీడియా వాడకాన్ని ఆరోగ్యకరంగా ప్రోత్సహించడం (healthy use) మంచిదని సూచిస్తున్నారు. పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, పూర్తిగా నిషేధం కంటే నియంత్రణ, అవగాహన అవసరమని నిపుణులు భావిస్తున్నారు. అయితే బిజీ లైఫ్‌లో ఇటు భారత్‌లో అలాంటి నిషేధం వద్దనే చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
కోర్టు ఏం చెప్పిందంటే..
భారత్‌లో చిన్నారులు సోషల్ మీడియా(Social Media) వాడకుండా నిషేధించడం తమ పరిధిలో లేదని సర్వోన్నత న్యాయస్థానం ఇది వరకే తేల్చి చెప్పింది. ఇది చట్టపరిధిలోని అంశమని స్పష్టం చేసింది. అంతేకాదు.. 13-18 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా అకౌంట్ల పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది.
కఠిన చట్టం లేదా?..
భారత్‌లో మైనర్లు సో.మీ. వాడకూడదనే రూల్ ఏం లేదు. రాజకీయ కోణం, ఇక్కడి జనాభా, సో.మీ. ప్లాట్‌ఫారమ్ జరిపే వ్యాపారాలను పరిగణనలోకి తీసుకుంటే అది సాహసమనే చెప్పాలి. అయితే.. కేంద్ర ప్రభుత్వం 2023లో Digital Personal Data Protection (DPDP) Act, 2023ను ఆమోదించింది. దీని ఆధారంగా DPDP Rules, 2025ను నోటిఫై చేసింది. ఈ నియమాల ప్రకారం.. 18 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల లేదా లీగల్ గార్డియన్ అనుమతి తప్పనిసరి. సోషల్ మీడియా కంపెనీలు పిల్లల డేటా సేకరణ, వినియోగం, షేరింగ్‌పై కఠిన నియంత్రణలు పాటించాలి. ఉల్లంఘన జరిగితే కంపెనీలకు రూ. 250 కోట్లు వరకు జరిమానా విధించవచ్చు. అయితే.. ఇది సక్రమంగా అమలు కావడం లేదు.
చివరగా..
ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటి దేశంగా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు చేస్తోంది. భారతదేశంలో ఇలాంటి నిషేధం అమలు సాధ్యమా అనే ప్రశ్నపై నిపుణులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి నిషేధం కంటే నియంత్రణ, అవగాహన, డిజిటల్ లిటరసీపై దృష్టి పెట్టడం భారతదేశానికి అత్యంత అనుకూలమని సూచిస్తున్నారు.


