జర్మన్ ఛాన్స్‌లర్ ఫ్రీడ్రిక్ మెర్జ్ భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఇండియాలో పర్యటించనున్నారు. భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, బెంగళూరును సందర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇది ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మెర్జ్ మొదటి అధికారిక పర్యటన కానుంది.
ఈ జనవరి 12న అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి, ఛాన్సలర్ మెర్జ్‌కు స్వాగతం పలకనున్నారు. గతేడాది 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతదేశం-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాలలో సాధించిన పురోగతిని ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. ఈ పర్యటనలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై దృష్టి సారించనున్నారు. అదే సమయంలో రక్షణ, భద్రత, విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణలు, పరిశోధన, పర్యావరణ, సుస్థిర అభివృద్ధిపై చర్చించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ వ్యాపార, పారిశ్రామిక నాయకులతో కూడా సమావేశం కానున్నారు. ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన సమస్యలపై అభిప్రాయాలను పంచుకుంటారు. అత్యున్నత రాజకీయ స్థాయిలో జరిగే సంభాషణల ద్వారా ఈ పర్యటన మరింత ముందుకు తీసుకువెళ్తుంది. ఇది ఇరు దేశాల ప్రజలకు, విస్తృత ప్రపంచ సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా భవిష్యత్ దృష్టితో కూడిన భాగస్వామ్యాన్ని నిర్మించాలనే భారతదేశం, జర్మనీ సంయుక్తంగా నిర్ణయించుకున్నాయి.


