ఆచూకీ కనిపెట్టడం అంత ఈజీ కాదు...  | Nepali Gang Robs Retired Army Officers Home | Sakshi
Sakshi News home page

వరుస నేరాలకు తెగబడుతున్న నేపాలీలు

Nov 17 2025 7:26 AM | Updated on Nov 17 2025 7:50 AM

Nepali Gang Robs Retired Army Officers Home

18 తులాల బంగారు ఆభరణాలు, రూ.95 వేల నగదుతో  పరారైన నేపాలీ ముఠా 

నేపాలీలు మరోసారి పంజా విసిరారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కాచిగూడకు చెందిన కార్టన్స్‌ ఫ్యాక్టరీ యజమాని హేమ్‌ రాజ్‌ ఇంట్లో జరిగిన రూ.2 కోట్ల సొత్తు చోరీ కొలిక్కి రాకముందే.. కార్ఖానా ఠాణా పరిధిలో ఆదివారం తెల్లవారుజామున మరో దొంగతన జరిగింది. ఆర్మీ మాజీ అధికారి ఇంట్లో ఇటీవల పనిలో చేరిన ఇద్దరు నేపాలీలు మరో నలుగురితో కలిసి దోపిడీకి పాల్పడ్డారు. ఇలా.. గడచిన తొమ్మిదేళ్లల్లో, వివిధ ఘటనల్లో నేపాలీలు ఎత్తుకుపోయిన సొత్తు రూ.7 కోట్లకు పైగానే. ఈ కేసుల్లో నిందితులు  చిక్కడం, సొత్తు రికవరీ కావడం దుర్లభంగా మారింది.

ఆచూకీ కనిపెట్టడం అంత ఈజీ కాదు... 
నేరాలు చేస్తున్న నేపాలీల ఆచూకీ కనిపెట్టడం కూడా అంత తేలిక కాదని పోలీసులు చెబుతున్నారు. అక్కడ నుంచి వచ్చే వీరికి ఇమ్మిగ్రేషన్‌ వంటివి ఉండట్లేదు. ఫలితంగా ఎప్పుడు వచ్చారు? ఎక్కడ నుంచి వచ్చారు? అనేవి వాళ్లు చెప్పే వివరాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. మరోపక్క ఇలా వచి్చన వాళ్లు నేరం చేసిన తర్వాత ఇక్కడే నివసిస్తున్నా పట్టుకోవడం దుర్లభంగా మారింది. సెల్‌ఫోన్లు, సెల్‌ నెంబర్లతో పాటు తమ గుర్తింపులు, పేర్లు కూడా మార్చేస్తుండటమే దీనికి కారణం. 2018లో అబిడ్స్‌ పరిధిలో నేరం చేయించిన కమల్‌ ఆ తర్వాత నగరానికి వచ్చి తలదాచుకున్నాడు. తాజాగా మలక్‌పేట పరిధిలోని మూసారాంబాగ్‌లో మరో చోరీ చేయించాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కమల్‌ను పట్టుకున్న పోలీసులు విచారిస్తే 2018 నాటి నేరం బయటపడింది.  

పోలీసులకు ఎన్నో తలనొప్పులు.. 
నేపాలీలు నేరాలు చేసినప్పుడల్లా ఆ కేసుల దర్యాప్తు పోలీసులకు పెనుసవాలే. వీరికి ఉద్యోగాలు ఇస్తున్న సెక్యూరిటీ సంస్థలు, ఏజెన్సీలు తమ వద్ద పూర్తి వివరాలు ఉంచుకోకపోవడం, ఉన్న అరకొర వివరాలూ క్షేత్రస్థాయిలో క్రాస్‌ చెక్‌ చేసుకోకపోవడం వంటి కారణాలతో దర్యాప్తులు జటిలంగా మారుతున్నాయి. మన పోలీసులు సరిహద్దులు దాటి వెళ్లినా... అక్కడి పోలీసుల సహకారం లేక నిందితులు చిక్కట్లేదు. 2017లో కార్ఖానా ఠాణా పరిధి నుంచి రూ.3 కోట్ల సొత్తు, నగదును నేపాలీలు చోరీ చేశారు. ఈ కేసులో నిందితులకు సంబంధించి పోలీసులు వద్ద పూర్తి ఆధారాలు, నేరగాళ్ళ చిరునామాలు ఉన్నాయి. అనేక ప్రత్యేక బృందాలు కొన్ని నెలల పాటు నేపాల్‌ వెళ్లి మకాం వేసి మరీ వచ్చాయి. అయినప్పటికీ స్థానిక పోలీసుల నుంచి సహకారం లేని కారణంగా నిందితుల్ని పట్టుకోలేకపోయారు. అనుమానితుల విచారణలో భాష అనేది మరో ప్రధాన అడ్డంకిగా మారుతోంది. తాజా అరెస్టుల మాదిరిగా దేశ సరిహద్దులు దాటకుండా నేపాలీలు చిక్కితే మాత్రమే కొద్దొగొప్పో రికవరీలకు ఆస్కారం ఉంటోంది.    

ఆర్మీ మాజీ అధికారిని బంధించి భారీ దోపిడీ
హైదరాబాద్: ఆర్మీ మాజీ అధికారి ఇంట్లో పని మనుషులుగా చేరిన భార్యాభర్తలు మరో నలుగురితో కలిసి దోపిడీకి పాల్పడ్డారు. ఆర్మీ అధికారిని తాళ్లతో కట్టివేసి ఇంట్లోని 18 తులాల బంగారు నగలు, రూ.95 వేల నగదుతో పరారయ్యారు. ఈ ఘటన కార్ఖానా పోలీస్‌ స్టేషన్‌లోని గన్‌రాక్‌ ఎన్‌క్లేవ్‌లో జరిగింది. తిరుమలగిరి ఏసీపీ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీలో కెపె్టన్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన డీకే గిరి కార్ఖానా గన్‌రాక్‌ ఎన్‌క్లేవ్‌లో భార్య స్మితతో కలిసి ఉంటున్నారు. 

వీరి ఇంట్లో గత నెల 21న బేగంపేటలోని రాజ్‌వీర్‌ సెక్యూరిటీ సంస్థ ద్వారా నేపాల్‌కు చెందిన భార్యాభర్తలు రాజేందర్, పూజా పని మనుషులుగా చేరారు. ఈ క్రమంలో స్మిత తల్లి శనివారం మరణించడంతో అంత్యక్రియల కోసం గిరి దంపతులు వెళ్లారు. సాయంత్రం గిరి రాత్రి ఇంటికి రాగా స్మిత అక్కడే ఉండిపోయింది. రాత్రి 12.15 గంటలకు ట్యాక్సీలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. గ్రౌండ్‌ ప్లోర్‌లో ఉన్న 60 ఏళ్ల మరో పని మనిషి దగ్గరకు వచ్చి మత్తు పానీయాన్ని తాగించారు.

 ఆమె మత్తులోకి జారుకోగానే ఆరుగురు కలిసి గిరి ఉంటున్న మొదటి అంతస్తులోకి వెళ్లి ఆయనను బెదిరించారు. ఆయనకు మత్తు మందు తాగించేందుకు ప్రయత్నించగా నిందితుల్లో ఒకడి చేతిని కొరకడంతో.. తాళ్లతో ఆయన కాళ్లూ చేతులు కట్టేసి కొట్టారు. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. ఆయన స్పృహ తప్పినట్లు చేసి కింద పడిపోయాడు. నిందితులు బీరువాలోని బంగారు నగలు, రూ.95 వేల నగదుతో పాటు బాధితుడి ఒంటిపై ఉన్న బంగారు ఉంగరం, గొలుసును లాక్కుని పరారయ్యారు. తెల్లవారు జామున 2 గంటల సమయంలో గిరి గట్టిగా కేకలు వేయడంతో పక్కన నివస్తున్నవారు వచ్చి గిరి కట్లు తొలగించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను పట్టుకునేందుకు ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement