రంగారెడ్డి జిల్లా: పరీక్షలు రాసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..
అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న గణేశ్‌తో కలిసి బండల హంసలేఖ (22), దీప్తి అనే ఇద్దరు విద్యార్థులు పిగ్లీపూర్ గ్రామంలోని అన్నమాచార్య కళాశాలలో పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తున్నారు. బ్రిలియంట్ కమాన్ నుంచి ముకుంద డెయిరీ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో హంసలేఖ, దీప్తి కిందపడగా, ఇదే సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ వెనుక చక్రాల కింద పడిన హంసలేక అక్కడికక్కడే చనిపోయింది. దీప్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గణేశ్‌కు సైతం గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.


