సాక్షి, హైదరాబాద్: నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 33 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ నెల రెండో వారం నుంచే ఈ మార్పు కనిపిస్తోంది. ఉదయం స్వల్పంగా చలి ఉన్నా.. 10 గంటల నుంచే భానుడు ప్రభావం చూపిస్తున్నాడు. గాలిలో 26 నుంచి 34 తేమశాతం మధ్య ఉండటంతో పొడి వాతావరణం నెలకొంది. ఈ నెల మూడో వారంలో అకాల వర్షాల సూచన ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
ఆ తర్వాత ఉక్కపోత మరింత పెరుగుతుందని అంటోంది. ఈసారి వేసవిపై ఎల్‌నినో ప్రభావం ఉండవచ్చని హెచ్చరిస్తోంది. మార్చి, ఏప్రిల్ మాసాల్లో సాధారణ ఉష్ణోగ్రతలతో పాటు అప్పుడప్పుడు వర్షాలు కురుస్తాయని, మే, జూన్‌లో మాత్రం ఎండలు అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందని ఆ శాఖ అంచనా వేస్తోంది.


