మెదక్‌ జిల్లా కలెక్టర్‌కు జైలుశిక్ష | Medak District Collector Sentenced To 6 Months In Jail | Sakshi
Sakshi News home page

మెదక్‌ జిల్లా కలెక్టర్‌కు జైలుశిక్ష

Feb 18 2026 10:07 AM | Updated on Feb 18 2026 10:51 AM

Medak District Collector Sentenced To 6 Months In Jail

సాక్షి, హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా చేగుంట మండలం బోనాల్‌ సర్వే నంబర్‌ 284/ఏ/2లో 2.22 ఎకరాల భూ వివాదంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయని కలెక్టర్, ఐఏఎస్‌ అధికారి శ్రీరాహుల్‌రాజ్‌కు హైకోర్టు ఆర్నెల్లు సాధారణ జైలు శిక్ష విధించింది. రూ.2 వేలు జరిమానా చెల్లించాలని చెబుతూ నాలుగు వారాలు గడువిచి్చంది. ఈ ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి నాలుగు వారాలు తీర్పు అమలును నిలిపివేసింది. మెదక్‌ జిల్లా చేగుంట మండలం బోనాల్‌ సర్వే నంబర్‌ 284/ఏ/2లో 2.22 ఎకరాల భూమికి తను వారసురాలినని, తన పేరుపై మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నాగవెల్లి లక్ష్మి 2024, ఏప్రిల్‌లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. కలెక్టర్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేశారు. లక్ష్మితో పాటు ప్రతివాది నారాయణ, మల్లయ్యలకు నోటీసులు ఇచ్చి మరోసారి పూర్తి విచారణ జరిపాలని ఆదేశించారు. సేల్‌డీడ్, సాదాబైనామా క్రమబదీ్ధకరణ చర్యలను పరిశీలించి చట్టప్రకారం ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. దీని కోసం మూడు వారాలు గడువిచ్చారు. జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసినా సెపె్టంబర్‌ వరకు అమలు చేయకపోవడంతో తిరిగి లక్ష్మి ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.

కోర్టు తీర్పునిచ్చినా కలెక్టర్‌ ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని, ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ ఏజీపీ(అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌) అందజేసిన రికార్డుల్లో తేదీ లేదని, పిటిషనర్‌కు నోటీసులు అందినట్లు నిర్ధారణ చేసుకోలేదని న్యాయమూర్తి గమనించారు. వాట్సాప్‌ ద్వారా పిటిషనర్‌కు పంపించామని ఏజీపీ పేర్కొన్నా ధిక్కార పిటిషన్‌లోని కౌంటర్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించలేదని అభిప్రాయపడ్డారు. రెండెకరాల భూమి కోసం 51 ఏళ్ల మహిళలను పదేపదే కోర్టుల చుట్టూ తిరిగేలా చేయడం సరికాదని అధికారుల తీరును తప్పుబట్టారు. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్‌ ధిక్కరించినట్లు పేర్కొన్న న్యాయమూర్తి ఆర్నెల్లు జైలు విధిస్తూ తీర్పునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement