సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో తెలంగాణ సెక్రటేరియట్‌లో ఉద్యోగుల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ ప్రభుత్వం కొత్త ఐడి కార్డులను ప్రవేశపెట్టింది.
గత కొద్ది నెలలుగా సచివాలయంలో నకిలీ ఉద్యోగుల బెడద ఎక్కువైంది. ఈ క్రమంలో నకిలీ ఉద్యోగులను అరికట్టేందుకు కొత్త ఐడీ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. కార్డులపై సెక్రటేరియట్ భవనం,తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిరూపాలను ముద్రించింది. అదనంగా క్యూ ఆర్ కోడ్, ఇంటర్నల్ చిప్, ఎంప్లాయి నెంబర్, ఫోటో వంటి వివరాలను చేర్చింది.
రెగ్యులర్ ఉద్యోగులు 1300 మంది, క్లాస్-4 ఉద్యోగులు 300 మంది.. మొత్తం 1600 మందికి ఈ కొత్త ఐడి కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఇటీవలే ఉద్యోగుల కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను అమలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఐడి కార్డుల ద్వారా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసింది. మార్ఫింగ్ లేదా నకిలీ కార్డులు తయారు చేసే అవకాశం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల గుర్తింపును సాంకేతిక ఆధారాలతో నిర్ధారించే ప్రయత్నం జరుగుతోంది.


