సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాచారంలో దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం ఇంటి ఓనర్‌ను దారుణంగా చంపేశారు ముగ్గురు యువకులు. ఆపై ఆ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా మాయం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ల కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి అసలు విషయం బయటపడింది.
నాచారంలో నివాసం ఉంటున్న సుజాతను ఆమె ఇంట్లో అద్దెకు ఉంటున్న ముగ్గురు యువకులు కిరాకతంగా హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని బ్యాగులో కుక్కి రాజమండ్రి(ఆంధ్రప్రదేశ్) తీసుకెళ్లారు. ఆ బ్యాగును కోనసీమ దగ్గర గోదావరిలో పడేసి వచ్చారు. సుజాత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే..
తమకు ఏం తెలియనట్లు సుజాత కుటుంబ సభ్యులతో కలిసి నిందితులు గాలించినట్లు నాటకమాడారు. ఈలోపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి నిందితులు బంగారం కోసం తామే సుజాతను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. హత్య ఎప్పుడు.. ఎలా జరిగింది?.. మృతదేహాన్ని రికవరీ చేశారా?.. తదితర వివరాలపై పోలీసులు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.


