సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పల్లె, పట్నం అంతా 2026కు ఘనంగా స్వాగతం పలికారు. అయితే పోలీసుల వైఖరితో న్యూఇయర్ సెలబ్రేషన్స్ వేడుకల్లో అక్కడక్కడ చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇటు జగ్గయ్యపేట పరిధిలో కేక్ కట్టింగ్ యువకుల మధ్య చిచ్చును రాజేసింది.
జగ్గయ్యపేట పట్టణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటాక.. తొర్రగుంటపాలెం రోడ్డుపై కొందరు యువకులు కేక్ కటింగ్‌కు ప్రయత్నించారు. అదే సమయంలో.. అటువైపుగా కారులో నలుగురు యువకులు వచ్చారు. నడిరోడ్డుపై సెలబ్రేషన్స్ ఏంటని?.. పక్క నిర్వహించుకోవాలని.. తమకు దారి ఇవ్వాలంటూ వాళ్లను కోరారు. అయితే..
కేక్ కట్టింగ్ అయ్యాకే కారు ముందుకు వెళ్తుందంటూ తేల్చి చెప్పడంతో మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో యువకులు ఒకరినొకరు తోసేసుకుని పిడిగుద్దులు గుప్పించుకున్నారు. ఈ దాడిలో కారులో వచ్చిన యువకులకు గాయాలు కావడంతో.. స్థానికులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాడి సమయంలో యువకులు మద్యం మత్తులో ఉన్నారా?. ఫిర్యాదు నమోదు అయ్యిందా?.. అనే విషయాలు తెలియాలంటే ఈ ఘటనపై పోలీసులు స్పందించాల్సిందే.


