సాగు ఎండమావిడి | - | Sakshi
Sakshi News home page

సాగు ఎండమావిడి

Feb 15 2026 12:43 PM | Updated on Feb 15 2026 12:43 PM

సాగు ఎండమావిడి

సాగు ఎండమావిడి

వరుస నష్టాలతో మామిడి తోటలను తొలగిస్తున్న రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు గత ఏడాది జరిగిన నష్టానికి పరిహారం చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించినా కరుణించని ఇన్సూరెన్స్‌ కంపెనీ గత రెండేళ్లలో ఎన్టీఆర్‌ జిల్లాలో 4,580 హెక్టార్లలో తోటలు నరికివేత

జి.కొండూరు: ప్రభుత్వ వివక్ష, ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల దాడితో ఏటా నష్టాలను చవిచూస్తున్న మామిడి రైతులు తోటల్లోని చెట్లను నరికేస్తున్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలులు వంటి ప్రకృతి విపత్తులతో మామిడి కాయలు నేలరాలినా ప్రభుత్వం పరిహారం చెల్లించడంలేదు. ప్రీమియం జమ చేసినా ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఏవో సాకులు చూపి బీమా పరిహారం ఇవ్వడంలేదు. సాగు, కోత ఖర్చులు కూడా రాక రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఈ రెండేళ్లలో 4,580 హెక్టార్లలో మామిడి తోటలను రైతులు తొలగించారు. ప్రభుత్వం చొరవ చూపి రైతులకు భరోసా ఇవ్వకపోతే మామిడి సాగు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

భారీగా నరికివేత

ఎన్టీఆర్‌ జిల్లాలో 22,896 హెక్టార్లలో మామిడి సాగవు తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో తీరు అందుకు భిన్నంగా ఉంది. మామిడి సాగు అధికంగా ఉండే తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో ఏటా పది శాతానికి పైగా తోటలను రైతులు తొలగించి పామాయిల్‌ సాగు చేపడుతు న్నారు. నీరు అందుబాటులో లేని ప్రదేశాల్లో ఇతర మెట్ట పంటలను సాగు చేస్తున్నారు. గత ఏడాది భారీ వర్షాలతో కాయ నేల రాలడంతో పాటు, ఉన్న కాయలు కూడా మంగు వచ్చి ధర పతనమై రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఈ ఏడాది మామిడి తోటల తొలగింపు అధికమైంది. ముదురు తోటలను తొలగిస్తున్న స్థాయిలో కొత్త తోటల సాగు ప్రారంభం కావడంలేదు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 623 క్టార్లలో మాత్రమే లేత తోటల సాగు ఉండడం మామిడి భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.

రూ.10.57 కోట్ల పరిహారం ఎక్కడ?

ఎన్టీఆర్‌ జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌ ఏడు, 13వ తేదీల్లో భారీ వర్షాలు, పెను గాలుల వల్ల మామిడి తోటల్లో కాయలు భారీగా రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో 15,300 హెక్టార్లలో 50 శాతానికిపైగా కాయలు రాలినట్లు ప్రాథమికంగా అంచనా వేసినప్పటికీ పంట నష్ట గణన బృందాలు ఇచ్చిన నివేదిక ప్రకారం 5,418 మంది రైతులకు చెందిన 3,021 హెక్టార్లలో 33 శాతాని కన్నా ఎక్కువగా కాయలు రాలినట్లు తేల్చారు. ఈ నష్టానికి రూ.10,57,37,534 పెట్టుబడి రాయితీ కింద నిధుల విడుదల కోసం ఉద్యాన శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నిధులు ఇప్పటి వరకు విడుదల కాలేదు.

ఇన్సూరెన్స్‌ కంపెనీ మొండిచేయి

2024–25 సంవత్సరానికి మామిడి తోటల బీమా పథకం కింద అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి ఎన్టీఆర్‌ జిల్లాలో 290 మంది రైతులు మామిడి బీమా ప్రీమియంగా రూ.13,26,328 చెల్లించారు. 2024 డిసెంబరు 15 నుంచి 2025, మే 31వ తేదీ మధ్య కాలంలో అధిక వర్షపాతం, గాలిలో తేమ శాతం, అధిక గాలి వేగం వంటి పరిమాణాల ఆధారంగా బీమా చెల్లించేందుకు నిబంధనలు విధించారు. దీనిని మండల స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవలప్‌ మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో నష్ట అంచనాలను లెక్కించి మీమా నిబంధనలకు సరిపోలిన ప్పుడు మాత్రమే బీమా పరిహారాన్ని రైతుకు అందించాల్సి ఉంది. అయితే గత ఏడాది ఏప్రిల్‌లో భారీ వర్షాలు, పెనుగాలులకు జరిగిన నష్టానికి రైతుల నుంచి ప్రీమియం తీసుకున్న ఇన్సూరెన్స్‌ కంపెనీ రైతులకు పరిహారం చెల్లించేందుకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement