మనదేశంలో ఉన్న ప్రతి సౌకర్యం సక్రమంగా ఉన్నవారికే. పుట్టుకతో దివ్యాంగులు లేదా ప్రమాదవశాత్తు దివ్యాంగులైన వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించే యత్నం చేయడం లేదనేది చాలామంది నిపుణుల వాదన. ఇంతలా ఏఐ సాంకేతికత వేగంగా దూసుకొస్తున్నప్పటికీ.. వాళ్ల విషయంలో ఇంకా పక్షపాత బుద్ధి, చిన్నచూపు మారడం లేదు. దాన్ని మార్చేందుకు కంకణం కట్టుకోవడమే కాదు ఆ దిశగా అడుగులు వేస్తూ..అందర్నీ చైతన్యవంతుల్ని చేసేలా ఆలోచింప చేసింది ఈ మహిళ. పైగా అందర్నీ బలవంతులుగా మార్చుదాం అనే సరికొత్త నినాదం ప్రతి ఒక్కరి మనసులో నాటేలా చేస్తోంది.
ఆ అమ్మాయే హబెన్ గిర్మా. అమెరికాకు చెందిన గిర్మాది ఎరిట్రియన్ వలస కుటుంబ నేపథ్యం. ఆమె పుట్టుకతో చెవిటి అంధ వ్యక్తి. కాలక్రమేణ అవయవాలు క్షీణించే సమయానికి తన బాల్యం గురించి క్షణ్ణంగా అర్థం చేసుకుంది. నెమ్మది..నెమ్మదిగా కనుమరుగవ్వుతున్న దృష్టి, కోల్పోవుతున్న వినికిడి శక్తికి భయపడలేదామె. తన సవాళ్లకు అనుగుణంగా తనను తాను మార్చుకుంది. అలాగే ఆమె తన సహాయక సాధనాలను అదనపు వస్తువులుగా కాకుండా తన జీవితంలో ఒక భాగంగా భావించడం నేర్చుకుంది.
సాధారణ పాఠశాలలో చదువుకుంది, బ్రెయిలీ నేర్చుకుంది. చాలామంది అంధ బధిరలకు లభించని అన్ని సౌకర్యాలతో పెరిగిందామె. ఇలాంటివి తనలాంటి వాళ్లందరికీ అందుబాటులో ఉంటే..వాళ్లు కూడా శక్తిమంతులవుతారనేది ఆమె ఆకాంక్ష. స్వతహగా చదువులో అపార ప్రతిభ కనబర్చే గిర్మా హార్వార్డ్ యూనివర్సిటీలో చదివే ఛాన్స్ కొట్టేసింది. అంతకుముందెన్నడూ అంధ బధిరలు లేని ఆ ప్రదేశంలో హెచ్‌ఎల్‌ఎస్‌లో చేరిన 'తొలి అంధ బధిర విద్యార్థి' గిర్మానే. అక్కడ పాఠాలు వినేందుకు డిజిటల్ రీడింగ్‌లను, బ్రెయిలీ డిస్‌ప్లేను ఉపయోగించింది. సోక్రటిస్ పద్ధతిలో వేగవంతంగా అర్థం చేసుకునే తర్కాన్ని అవపోశన పట్టింది.
అలాగే తరగతిగది చర్చలను వాయిస్ ట్రాన్స్‌లిటర్ల సాయంతో తన ఇయర్‌ఫోన్‌లో వినిపించేలా ఒక వ్యవస్థను రూపొందించింది. అలాగే ఎక్కువ శబ్దం ఉన్న ప్రదేశాలలో ప్రజలు నేరుగా తనకు చెప్పలేని వాటిని టైప్ చేసేందుకు బ్రెయిలీ డిస్‌ప్లేకు బ్లూటూత్ కీబోర్డుని జత చేసింది. ఇలా ఇన్ని సౌకర్యాలతో తాను లా చదివి ఉత్తీర్ణురాలయ్యా..మరి నాలాంటి మిగతా వాళ్ల పరిస్థితి ఏంటనే ఆమె మదిని తొలిచేస్తున్న ప్రశ్న అది. ఆ నేపథ్యంలోనే ఆమె లా అనంతరం బర్కిలీలోని డిసేబిలిటీ రైట్స్ అడ్వకేట్స్‌లో స్కాడెన్ ఫెలోగా చేరి, ఆ తర్వాత అక్కడ స్టాఫ్ అటార్నీగా పనిచేశారు.
పైగా అక్కడ వికలాంగులకు సాంకేతికత అందుబాటులో ఉంచేలా చేయడంలో సహాయ సహకారాలు అందించింది. అంతేగాదు వర్చువల్ వ్యాపారాలకు అమెరికన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ వర్తిస్తుందని వాదించారామె. దివ్యాంగులకు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేలా అన్నింట సాంకేతికత అందుబాటులో ఉండేందుకు కృషి చేశారామె. ఆమె కృషిని గుర్తించిన అమెరికా వైట్‌హౌస్ 2013లో ఆమెను ఛాంపియన్ ఆఫ్ చేంజ్‌గా ప్రకటించింది. ఆ తర్వాత ఆమె పబ్లిక్ స్పీకర్‌గా, యాక్సెస్ అడ్వకేట్‌గా మారారు.
దివ్యాంగులకు విద్యను చేరువ చేసే సాంకేతికతను పొందడంలో ఉండే అడ్డంకులను తొలగించడానికి తన జీవితాన్ని అంకితం చేశారామె. 2019లో తన ఆత్మకథ హబెన్: ది డెఫ్‌బ్లైండ్ వుమన్ హూ కాంకర్డ్ హార్వర్డ్ లా'ను ప్రచురించారు. ఇదే ఆమె తొలి పుస్తకం కూడా. అది వైకల్యం చుట్టూ ఉన్న ప్రజల భాషను మార్చేందుకు ఉపకరించింది. అంతేగాదు వికలాంగులు స్ఫూర్తికోసమే ఉన్నారనే భావనను గిర్మా పదే పదే వ్యతిరేకించేవారు. దానికి బదులుగా వాళ్లను గౌరవంగా బతికేలా సౌకర్యాలు అందివ్వండని విజ్ఞప్తి చేస్తోంది.
ఆమె పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ వ్యవస్థలలో దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని రూపొందించినప్పుడు ప్రతిభ అసాధారణంగా ఉండదని, తాము కూడా మీలాంటి వాళ్లమనే భావన ఇరువురిలో కలుగుతుందని అంటోందామె. దయచేసి ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించమని విజ్ఞప్తి చేస్తోంది. పైగా తాను సవాళ్లను అధిమించిన గొప్ప వ్యక్తిని కాదని, సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండటంతో సాధారణ వ్యక్తులు సాధించిన విజయంగా పరిగణించండి చాలు అని అంటోంది. అంతేగాదు మనం మాత్రమే బలవంతులం అవ్వడం కాదు, అందరూ ఇదే కోవకు చెందుతారు అని గుర్తురెగండి అని కోరుతోందామె.
(చదవండి: 98 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా బామ్మ..!)


