అందరి ఆకాంక్ష అందరి ఆనందమే | Sakshi Interviews with film personalities about the New Year 2026 | Sakshi
Sakshi News home page

అందరి ఆకాంక్ష అందరి ఆనందమే

Jan 1 2026 3:38 AM | Updated on Jan 1 2026 3:51 AM

Sakshi Interviews with film personalities about the New Year 2026

‘నేను’... ‘నేను మాత్రమే’ అనే భావన వదిలిపెట్టాలి. ‘అందరం’.. ‘అందరి కోసం’ అనుకోవాలి. ఆనందం ఆత్మానందం కావాలి... ఒంటరి ఉమ్మడి కావాలి. ఇంటి నుంచి దేశాన్ని చూడాలి... సమాజం పట్ల కృతజ్ఞత ఉండాలి. సంతోషమయ జీవితానికి తాళం చెవులు  మన వద్దే ఉన్నాయని తెలుసుకోవాలి. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ పెద్దలు ఇస్తున్న సందేశం ఇదే.

ఇంటి నుంచి దేశం వరకూ
గతంలో ఉమ్మడి కుటుంబాలుండేవి. కలిసి మెలిసి ఉండేవాళ్లు. అందులో లోటుపాట్లున్నా సుఖసంతోషాలు కూడా ఉండేవి. మేం సికింద్రాబాద్‌ రైల్వే క్వార్టర్స్‌లో ఒకే కప్పు కింద 14 మందిమి ఉండేవాళ్లం. నవ్వుకునే వాళ్లం. గిల్లికజ్జాలు పెట్టుకునేవాళ్లం. అంతలోనే కలిసిపోయేవాళ్లం. పంచుకు తినడం అలవాటు చేసుకున్నవాళ్లం. 

ఇప్పుడు కూడా పంచుకుంటున్నారు... కాకపోతే ఉమ్మడి నుంచి విడిపోయి మైక్రో కుటుంబంగా... మళ్లీ అందులోనూ భార్యకు ఒక గది... భర్తకు ఒక గది... పిల్లలకు చెరో గది... మొన్నెక్కడో చదివాను... చైనాలో ‘వన్‌ ఆర్‌ నన్‌’ విధానం వల్ల తాత ఒక్కడే, తండ్రి ఒక్కడే, కొడుకు ఒక్కడేగా కొన్ని దశాబ్దాల పాటు సాగి వాళ్లకు మనుషుల మధ్య ఉద్వేగాలే అర్థం కాని స్థితి ఏర్పడిందని. మనుషులతో ఉంటేగా మనుషులు అర్థమయ్యేది.

 మనుషులకు దూరమయ్యే కొద్దీ మన నుంచి మనం కూడా దూరమవుతామని అర్థం చేసుకోవాలి. కొత్త సంవత్సరంలో మనం ఉమ్మడి కుటుంబాల వైపు వెళ్లాలని  చెప్పనుగానీ అంతా మనది అన్న భావనైనా అలవర్చుకుంటే, అన్నీ మనవే అనుకుంటే, ఆ ధోరణి ఇంటి నుంచి బయలుదేరితే దేశం వరకూ పాకుతుంది. అప్పుడు అందరం ఒక కుటుంబం అవుతాం. ఆ తర్వాత అంతా వసుధైక కుటుంబకమే.
– తనికెళ్ల భరణి, నటుడు–రచయిత

ఆనందం నుంచి ఆత్మానందానికి...
మన పుట్టుక ప్రకృతి చేతిలో ఉంది. మన బాల్యం పెద్దల చేతిలో ఉంది. యవ్వనం మాత్రం మన చేతిలోనే ఉంది. ‘బీదవాడిగా పుట్టటం నీ తప్పు కాదు. మరణించటం మాత్రం నీ తప్పు’ అన్నాడు బిల్‌ గేట్స్‌. ‘బీద తండ్రికి సంతానమవటం నీ చేతుల్లో లేదు. ధనవంతులైన పిల్లలకి తండ్రి అవటం మాత్రం నీ చేతుల్లో ఉంది’ అనేది అర్థం చేసుకోవాలి. 

ఇలా కొత్త సంవత్సరాన్ని సందర్భంగా తీసుకొని ఎదిగేందుకు సంకల్పించాలి.  నెమలి అందంగా ఉంటుంది. చేప నీళ్లలో ఎంత సేపయినా ఈదుతుంది. కోతి అతి వేగంగా చెట్లు ఎక్కగలదు. జింక స్పీడ్‌గా పరిగెడుతుంది. స్థలాలు మారితే అన్నీ ఫెయిల్‌ అవుతాయి. కాబట్టి నువ్వు ఏ రంగంలో నిష్ణాతుడవో అదే రంగంలో అభివృద్ధి చెందటానికి ప్రయత్నం చెయ్యి. ఆ పనిని ఆనందించు. 2026లో ఇలాంటి నిర్ణయం కూడా తీసుకోవచ్చు.

ఆనందం అంటే అనేక సంతోషాల మిశ్రమం. మొదటి రోజు సినిమా టికెట్‌ దొరికింది. సంతోషం. పిల్లలకు ఫస్ట్‌ ర్యాంకు వచ్చింది సంతోషం.  ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చింది లేదా వ్యాపారంలో లాభం వచ్చింది.  సంతోషం. కొత్తగా ఇల్లు కట్టడం జరిగింది. సంతోషం. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సంతోషం కలుగుతూ ఉంటేదాన్ని ‘ఆనందం’ అంటారు. 

ఎదుటివాడు ఇల్లు  కట్టుకున్నా సంతోషంగా,  ఎదురింటావిడ ఖరీదైన నెక్లెస్‌ కొనుక్కున్నా సంతోషంగా ఉండగలిగితే దాన్ని ‘ఆత్మానందం’ అంటారు. ఇలా ఈ సంవత్సరం ఆనందం నుంచి ఆత్మానందానికి ఎదగవచ్చు. ఇక నీ తాలూకు గెలుపు గానీ, ఎదుటివారి ఆనంద విషాదాలతో సంబంధం గానీ లేకుండా ప్రకృతితో లీనమై నిరంతరం ఆనందంతో ఉండగలిగితే దాన్ని ‘బ్రహ్మానందం’ అంటారు.  ఈ స్థితికి చేరితే అంతకుమించి ఏమి కావాలి.
– యండమూరి వీరేంద్రనాథ్, నవలా రచయిత

ఆనందానికి తాళంచెవులు
కొత్త సంవత్సరంలో అందరం ఆనందంగా ఉండాలనే కోరుకుంటాం. మరి ఆనందంగా ఉండటంలోని రహస్యాన్ని తెలుసుకున్నామా? చాలా సులభం. మనం రోజులో రెండు వంతులు గడిపేది కుటుంబ సభ్యులతోటే. కలిసి ఉన్నప్పుడు అభి్రపాయ భేదాలు సహజం. అవి కలతలకు దారి తీయకుండా చూసుకోగలిగితే మనం రోజులో రెండువంతులు సంతోషంగా గడపవచ్చు. మిగిలిన ఒక వంతు వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో గడుపుతాం.

 పనిని మనం ప్రేమిస్తే అది ఆనందాన్ని ఇస్తుంది. అయితే అందరికీ తాము ప్రేమించే పని చేసే అదృష్టం ఉండదు. కాని చేసే పనిని ప్రేమించడం అభ్యసిస్తే అప్పుడది మానసిక అలసట ఇవ్వదు. మనుషులతో పేచీలు మన ఆనందాన్ని హరిస్తాయి. అందరితో స్నేహంగా ఉంటే ఆనందమే. ఇక సోషల్‌ మీడియా. జపాన్‌ వారు పాటించే గోల్డెన్‌ రూల్‌ ఏమిటంటే బంధుమిత్రులతో సహా ఎవరితోనూ మతం, రాజకీయాల గురించి చర్చించకూడదు.

 అప్పుడు సోషల్‌ మీడియా కూడా ఆనందాన్నిస్తుంది. ఇక సంపాదన ఆనందాన్ని ఇచ్చేలా చూసుకోవాలి. నేరపూరితమైన సంపాదనకి దూరంగా ఉంటే మనశ్శాంతి. మనశ్శాంతే ఆనందం. ఆనందమే మనశ్శాంతి. ఇలా ఆనందానికి తాళం చెవులు చాలా ఉన్నాయి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా ఆనందాన్ని ఇస్తుంది. అన్నింటికంటే ముఖ్యం జీవించి ఉండటం ఆనందం. ఆరోగ్యమే ఆనందం. 
– మల్లాది వెంకట కృష్ణమూర్తి, నవలా రచయిత

సమాజంలో భాగం అవుతూ... శ్రేయస్సు ఆశిస్తూ
‘వచ్చునపుడు కొత్తవే వత్సరాలు.... పాతబడిపోవు మన పాత పనుల వల్ల’ అని ఒక మహానుభావుడు అన్నాడు. సంవత్సరాలు కొత్తగానే వస్తాయి... మనం చేసే పాతపనుల వల్ల అవి పాతబడిపోతాయి. అలా కాకుండా కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు, కొత్త బాటలు ఎంచుకుని పయనిస్తే, ఆ నిర్ణయాలకు  కట్టుబడి ఉంటే కొత్త సంవత్సరం తప్పకుండా కొత్త ఫలితాలను ఇస్తుంది. కాలంతోపాటు మనం పయనిస్తాం సరే. 

కాని ఈ పయనంలో విజయం సాధించే విధంగా మన చర్యలు, పనులు ఉండాలి. అయితే విజయంతోపాటు విలువలు కూడా ఉండాలి. మోసాలతో, కల్లబొల్లి కబుర్లతో, ఎదుటివాణ్ణి అణిచేసి సాధిస్తే వచ్చేది తాత్కాలిక విజయం. అలాంటి విజయం చివరికి పాతాళంలో పడేస్తుంది. కాని నిజాయితీతో, నిర్మల హృదయంతో, ధర్మప్రవర్తనతో ప్రయత్నిస్తే వచ్చేది మాత్రం శాశ్వత విజయం. కాబట్టి ఏ విజయం వైపు వెళ్లాలనేది నిర్ణయం తీసుకోవాలి. 

ఇక మన ఉనికే సర్వస్వం అన్నట్టుగా లోకాన్ని చూడకూడదు. మనం ఈ సమాజంలో ఒక భాగం. మన ఆనందానికి మూలం సమాజంలోని వివిధ శ్రేణుల శ్రమ. కాబట్టి సమాజంలో అందరినీ ప్రేమించాలి. అప్పుడే పూర్తిస్థాయి ఆనందంతో ముందుకు వెళ్లగలం. సమాజం మనకు ఎంతో ఇస్తుంది... సమాజానికి ఇచ్చే సందర్భం వచ్చినప్పుడు ఇవ్వాలి. సమాజంలో చోటు చేసుకుంటున్న జాడ్యాలను చూసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని నా ఆకాంక్ష. అలాగే ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలి. ఊరంతా ఆస్తిపాస్తులు ఉన్నా అవి ఊపిరితిత్తులు చేసే పని చేయలేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
– చంద్రబోస్, సినీ గేయకర్త

ప్రతి క్షణం ఒక మధుర జ్ఞాపకమే 
– శ్రీదేవి
‘‘నా జీవితంలో 2025 ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరం. ‘కోర్ట్‌’ సినిమాతో నేను హీరోయిన్‌గా పరిచయమయ్యాను. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల ఆదరణ  పొందడం ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది. ‘కోర్ట్‌’ నాకు కేవలం సినిమా మాత్రమే కాదు.. నా కలలకు మొదటి అడుగు. సినిమా విడుదల రోజు నుంచి ప్రేక్షకుల స్పందన వరకూ ప్రతి క్షణం ఒక మధుర జ్ఞాపకమే. కుటుంబం గర్వంగా చూసిన క్షణాలు, ఇండస్ట్రీ నుంచి వచ్చిన అభినందనలు ఎప్పటికీ మరచి పోలేను’’ అన్నారు శ్రీదేవి. నూతన ఏడాదిని(2026) పురస్కరించుకుని ఆమె సాక్షితో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ఆ విశేషాలు... 

→ ‘కోర్ట్‌’ మూవీతో నాకు మంచి క్రేజ్‌ వచ్చింది. బయటికి వెళ్లినప్పుడు జనాలు శ్రీదేవి అనీ, ‘జాబిలి’(కోర్ట్‌ సినిమాలో నేను చేసిన పాత్ర) అని కూడా పిలుస్తున్నారు. ‘జాబిలి’ అని పిలిచినప్పుడు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతోంది. ఆ పాత్రను ప్రేక్షకులు ఎంత ప్రేమించారో అర్థమవుతోంది. ఒక నటిగా మనం చేసిన పాత్రతో జనాలు మనల్ని పిలవడం కంటే మించిన ఆనందం ఏముంటుంది. నిజ జీవితం లో నేను చాలా సింపుల్‌గా ఉంటాను. జాబిలి పాత్ర నాలోని సున్నితమైన మనస్తత్వాన్ని బయటకు తీసుకొచ్చింది. ఆ పాత్ర చేసిన తర్వాత జీవితాన్ని మరింత బలంగా, ధైర్యంగా చూడడం నేర్చుకున్నాను.

→ హీరోయిన్ల డ్రెస్సింగ్‌ విషయంలో జనాల్లో, నెటిజన్స్‌ నుంచి విమర్శలు వస్తుండటం నిజమే. అయితే ప్రతి ఒక్కరికీ అభి్రపాయాలు ఉంటాయి. పబ్లిక్‌లో ఉన్నవాళ్లుగా అందరి అభి్రపాయాలను గౌరవిస్తూ, పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లడమే ముఖ్యమని నేను భావిస్తున్నాను.

→ 2025లో ఊహించినదానికంటే ఎక్కువ లక్ష్యాలను సాధించాను. ముఖ్యంగా ప్రేక్షకుల ప్రేమ, అభిమానం దక్కాయి. 2026లో మంచికథలు ఎంచుకోవడం, బలమైన పాత్రలు చేయడంతోపాటు నటిగా నన్ను నేను మెరుగుపర్చుకోవడమే లక్ష్యం. 

→ ఒక బలమైన లేడీ ఓరియంటెడ్‌ క్యారెక్టర్‌ చేయాలన్నది నా కల. అలాగే మంచి నటిగానే కాదు.. మంచి మనసున్న మనిషిగానూ ప్రేక్షకుల్లో గుర్తుండిపోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాను. వాటిలో తెలుగులో ‘బ్యాండ్‌మేళం’ ఒకటి. కోన ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తమిళంలో ‘హైకూ’ అనే చిత్రంతో పాటు కేజేఆర్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ లో మరో సినిమా చేస్తున్నాను. తెలుగుతోపాటు ఇతర భాషల నుంచి, పెద్ద ప్రొడక్షన్‌ హౌసెస్‌ నుంచి మంచి అవకాశాలు రావాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

ఆ మూడూ నా గోల్స్‌
– మానసా చౌదరి 
‘బబుల్‌ గమ్‌ మూవీ’తో తెలుగు తెరకు పరిచయమైన మానసా చౌదరి ‘లక్కీ భాస్కర్‌’, ‘ఆర్యన్‌’ వంటి సినిమాల్లో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సాక్షితోఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ఆ విశేషాలు...  

→ 2026లో నా లక్ష్యం ఏంటంటే.. వీలైనంత వరకు ఎక్కువ సినిమాలు చేయడమే కాదు, వైవిధ్యమైన పాత్రలలో నటించడం కూడా!

→ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి చాలా ట్రిప్పులకు వెళ్లాలి. ఈసారి ఇంటర్నేషనల్‌ ట్రిప్స్‌ ట్రై చేద్దామనుకుంటున్నాను. అలాగే ప్రస్తుతం ఉన్నదానికంటే మరింత చక్కని షేప్‌ తెచ్చుకోవాలనుకుంటున్నాను. మేజర్‌గా ఈ మూడు నా 2026 గోల్స్‌. అలాగే పని విషయంలో క్రమశిక్షణగా ఉండాలనుకుంటున్నాను. మీడియాలో యాక్టివ్‌గా ఉండటం. యాక్టింగ్‌ ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నా.. ఇవి కూడా 2026లో నా లక్ష్యంగా పెట్టుకున్నాను.  

→ ‘లోక’ లాంటి ఓ అందమైన సినిమా చేయాలన్నది నా డ్రీమ్‌ రోల్‌. అలాగే ‘అమ్ము, తప్పడ్‌’ వంటి చిత్రాలు చేయాలనీ, ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో సాయిపల్లవిగారిలాంటి క్యారెక్టర్‌లో నటించాలి... ఇలా ఇవన్నీ నా డ్రీమ్‌ రోల్సే. త్రివిక్రమ్‌గారి సినిమాలో నటించాలన్నది కూడా నా కల. 

→ ప్రస్తుతం ఇంటర్‌నెట్, ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ని విషయాలు అందుబాటులో ఉన్నాయి.. చాలా విషయాల సమాచారం ఉంటోంది. ఇప్పుడు కొత్తగా ఏఐ కూడా వచ్చింది. దీంతో ఏది నిజం, అబద్ధం అన్నది తెలియకుండా ఉంది. ఏ సమాచారాన్ని అయినా దుర్వినియోగం చేయకుండా మనకు కావాల్సిన దాన్ని మాత్రమే తీసుకోవాలని కోరుతున్నాను. 

→ కోవిడ్‌ తర్వాత చాలా మంది హార్ట్‌ ఎటాక్‌ బారిన పడుతున్నారు. బాగా ఆరోగ్యంగా ఉన్నవారు కూడా సడెన్‌గా గుండెపోటుకి గురవడం చూస్తున్నాం, వింటున్నాం. కరోనా తర్వాత శరీరంలో అక్కడక్కడా లంగ్స్‌ ఫామ్‌ అయిపోయి హార్ట్‌ ఎటాక్స్, బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ రావడం చూస్తున్నాం. అందరూ హెల్దీగా లైఫ్‌స్టైల్‌ మెయింటైన్‌ చేసి, సమయానికి నిద్రపోవడం, తినడం, అలాగే సమయానికి బాడీ చెకప్స్‌ చేయించుకోవడం చాలా ముఖ్యం అని నేను విన్నవిస్తున్నా. ఒత్తిడి వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీన్ని తగ్గించుకోవడానికి యోగా చేయడం, కుటుంబంతో కలిసి సరదాగా గడపడం, స్నేహితులతో సమయాన్ని గడపడం వంటివి చేయాలని కోరుతున్నాను.  

→ ప్రస్తుతానికి శ్రీవిష్ణు, తరుణ్‌ భాస్కర్‌గార్లు చేసిన ‘గాయపడ్డ సింహం’ అనే సినిమాలో చేశాను.. అది పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉంది. సందీప్‌ కిషన్‌గారు చేసిన ‘సూపర్‌ సుబ్బు’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించాను. అది కూడా పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉంది. అంకిత్‌ కొయ్య హీరోగా గోపీనాథ్‌ రెడ్డిగారు దర్శకత్వం వహిస్తున్న ‘లవ్‌ జాతర’ అనే మూవీ చేస్తున్నాను. అదేవిధంగా తెలుగులో ఓ సినిమా, తమిళంలో మరో సినిమా ఒప్పుకున్నా.

టైమ్‌ లైన్‌ పెట్టుకుంటాను
– మనికా చిక్కాల

ఇటీవల విడుదలై, ప్రేక్షకాదరణ దక్కించుకున్న ‘దండోరా’ సినిమాలో సుజాత అనే ఓ ప్రధాన పాత్రలో నటించిన మనికా చిక్కాల ఈ న్యూ ఇయర్‌ సందర్భంగా  పంచుకున్న సంగతులు...
→ ఈ ఆధునిక యుగంలో ఇప్పటికీ పరువు హత్యలు జరుగుతుండటం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఈ సామాజిక సమస్య నిర్మూలనకు మా ‘దండోరా’ సినిమా కనీసం ప్రేక్షకుల్లో ఒక శాతంమందినైనా ఆలోచింపజేయగలిగినట్లయితే, మేం విజయం సాధించినట్లే.

→ అమ్మాయిలు వారి నిజమైన ప్రేమ గురించి ఇంట్లో వ్యక్తపరచే స్వేచ్ఛ విషయంలో ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగుపడిందనే చెప్పవచ్చు. పదేళ్ల క్రితం ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. లవ్‌మ్యారేజ్‌ల గురించి తల్లీదండ్రులు ఇప్పుడు కాస్త ఓపెన్ గానే చర్చిస్తున్నారు. చె΄్పాలంటే... మా తల్లిదండ్రులు కులం విషయంలో కాస్త కఠినంగానే ఉండేవారు. కానీ మా సిస్టర్‌ మా అమ్మానాన్నలను ఒప్పించి, ఓ క్రిస్టియన్ ను వివాహం చేసుకుంది. ఇది చూసి నేనూ హ్యాపీగా ఫీలయ్యాను. ఏ తల్లిదండ్రులైనా వారి కుమార్తె భద్రత గురించే గదా హై ప్రయారిటీ ఇచ్చేది!

→ ఈ ఏడాది నాకు చాలా స్పెషల్‌. వృత్తిపరంగా మా ‘దండోరా’ సినిమా విడుదలై, మంచి గుర్తింపును తీసుకు వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. వ్యక్తిగతంగా నా సిస్టర్‌ ఓ బేబీకి జన్మనివ్వడం  నన్ను ఇంకా సంతోషపరచే విషయం.

→ ప్రతి ఏడాది డిసెంబరు 31న మా ఇంట్లో వాళ్లతో కలిసి కేక్‌ కట్‌ చేసి, న్యూ ఇయర్‌కి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెబుతాం. సెలబ్రేషన్స్ చేస్తాం. ఇంట్లో కొన్ని గేమ్స్‌ కూడా ఆడతాం. ఇక న్యూ ఇయర్‌ రిజల్యూషన్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ నిర్ణయించుకోను. అయితే ఫలానా పనిని, ఫలానా టైమ్‌ కల్లా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయాలనే టైమ్‌లైన్ ను పెట్టుకుంటాను.

ఇంటర్వ్యూలు: 
డేరంగుల జగన్‌ మోహన్‌
ముసిమి శివాంజనేయులు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement