విందుల హోరు.. యాంటాసిడ్స్‌ జోరు! | Highest sales and consumption of medicines in Hyderabad | Sakshi
Sakshi News home page

విందుల హోరు.. యాంటాసిడ్స్‌ జోరు!

Dec 29 2025 4:15 AM | Updated on Dec 29 2025 4:15 AM

Highest sales and consumption of medicines in Hyderabad

వారాంతాల్లో పెరిగిన కొనుగోళ్లు

అత్యధికంగా హైదరాబాద్‌లో వినియోగం 

ఫార్మ్‌ఈజీ హెల్త్‌ రిపోర్ట్‌–2025లో వెల్లడి

ఆరోగ్య సమస్య తలెత్తగానే ఆసుపత్రికో, మందుల షాపుకో పరుగు తీస్తుంటారు చాలా మంది. కోవిడ్‌–19 మహమ్మారి నేర్పిన పాఠాలతో జనంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. సమస్య రాక ముందే భారతీయులు ముందస్తు నివారణకు ప్రాధాన్యమిస్తున్నారు. అయితే నచ్చిన వంటకాలను ఆరగించడంలో ఏమాత్రం ఆలోచించడం లేదు. అందుకే కాబోలు శని, ఆదివారం వచ్చిందంటే చాలు యాంటాసిడ్స్‌ కోసం కస్టమర్లు పరుగులు తీస్తున్నారు.

హెల్త్‌కేర్‌ ప్లాట్‌ఫామ్‌ ఫార్మ్‌ఈజీ తన వేదిక ద్వారా ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తుల అమ్మకాలు, రోగ నిర్ధారణ పరీక్షల బుకింగ్స్‌ను విశ్లేíÙంచి హెల్త్‌ రిపోర్ట్‌–2025 రూపొందించింది. విటమిన్స్, సప్లిమెంట్స్‌ కొనుగోళ్లు, రోగ నిర్ధారణ పరీక్షలు, దీర్ఘకాలిక, తీవ్ర అనారోగ్య సమస్యల పరిష్కారానికి చికిత్సలు.. కాలానుగుణంగా లేదా సంక్షోభం తలెత్తినప్పుడే కాకుండా ప్రణాళికాబద్ధంగా, ఏడాది పొడవునా అలవాట్లుగా ఉద్భవిస్తున్నాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్‌ మెట్రోలకే పరిమితం కాలేదని.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ వ్యాపించిందని వివరించింది.  

పోషకాహార లోపాలకు చెక్‌.. 
మొదటిసారిగా విటమిన్స్, సప్లిమెంట్స్‌ అత్యధిక ఆర్డర్లు నమోదైన కేటగిరీగా మారాయని నివేదిక తెలిపింది. పోషకాహార లోపాలకు చెక్‌ పెట్టడంలో భాగంగా మల్టీ విటమిన్స్‌కు కస్టమర్లు జై కొట్టారు. విటమిన్‌–బి సప్లిమెంట్లు టాప్‌లో నిలిచాయి. ఏడాదిలో వీటి విక్రయాలు 33% పెరిగాయి. కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్‌–డి తరువాతి స్థానాల్లో నిలిచాయి. పోషకాహార లోపాలు, ఎముకలు, కీళ్ల ఆరోగ్యం గురించి జనంలో అవగాహన పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం.  

ముందస్తుగా తెలుసుకోవడానికి.. 
రోగ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా అత్యధికులు విటమిన్‌–డి పరీక్షలు చేయించుకున్నారు. థైరాయిడ్‌ గ్రంథి పనితీరును తెలుసుకునే టెస్టులు, రక్తంలో చక్కెర స్థాయిని కొలిచే హెచ్‌బీఏ1సీ పరీక్షలు టాప్‌–3లో నిలిచాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయిస్తున్నారు. అనారోగ్యానికి గురైనప్పుడే కాకుండా.. మొత్తం ఆరోగ్యాన్ని వివరంగా చూపే కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట్‌ (సీబీసీ), కొవ్వు స్థాయిని తెలిపే లిపిడ్‌ ప్రొఫైల్స్‌ టెస్టులు క్రమంగా సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగమయ్యాయి.  

ఎప్పుడేం కొంటున్నారంటే..
ఉదయం 6–9 మధ్య: విటమిన్స్, కాల్షియం, దీర్ఘకాలిక రోగాలకు మందులు. 
రాత్రి 10 నుంచి ఉదయం 4 వరకు: రక్తపోటు, హృదయ సంబంధ ఔషధాలు, విటమిన్‌–సి, కాల్షియం సప్లిమెంట్స్‌.  

వారాంతాల్లో: యాంటాసిడ్స్, స్కిన్‌ కేర్, సన్‌ కేర్, ఎనర్జీ డ్రింక్స్, ఓవర్‌ ద కౌంటర్‌కు మారిన కొత్త మందులు, స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌ సప్లిమెంట్స్, మొక్కలతో తయారైన ఉత్పత్తులు, గ్లూకోజ్, బీపీని చెక్‌ చేసే డిజిటల్‌ మెషీన్స్‌.

ఆదివారాల్లో: నచ్చిన వంటకాలతో ఇంటిల్లిపాదీ ఎంజాయ్‌ చేసే రోజు. బంధువులు, స్నేహితులు తోడైతే ఇక విందు భోజనమే. అందుకే కాబోలు యాంటాసిడ్స్‌ కొనుగోళ్లు 14–18% పెరిగాయి.  

కాలాన్నిబట్టి కొనుగోళ్లు.. 
వర్షాకాలం: జ్వరం సంబంధ టెస్టులు, ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఫంగల్‌ క్రీమ్స్, దోమల నివారణ ఉత్పత్తులు. 
శీతాకాలం: జలుబు, దగ్గు మందులు, విటమిన్‌–సి, మాయిశ్చరైజర్స్‌. 
వేసవి: సన్‌్రస్కీన్స్, ఎలక్ట్రోలైట్‌ సప్లిమెంట్స్‌.

నివేదిక హైలైట్స్‌.. 
2025లో ఫార్మ్‌ఈజీ అమ్మకాల్లో 71% సోమ–శుక్రవారం మధ్య నమోదయ్యాయి.  
కాలుష్యం కారణంగా ఢిల్లీ, ముంబైలో మాస్క్‌లు, నెబ్యులైజర్స్, ఇన్‌హేలర్స్, ఆక్సిమీటర్స్‌ కొనుగోళ్లు ఎక్కువ. 
ప్రతి రెండో కుటుంబం సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా జీర్ణ సంబంధ ఉత్పత్తిని కొనుగోలు చేసింది. 
మధుమేహ (జీఎల్‌పీ–1) మందులు వేగంగా వృద్ధి చెందుతున్న విభాగం. ప్రతి నెల సేల్స్‌ 12% దూసుకెళ్తున్నాయి.  
డయాబెటిస్‌ ఔషధాలు కొంటున్నవారిలో సగం మంది 25–45 ఏళ్ల మధ్య వయసు్కలు.

నగరాల వారీగా ఇలా.. 
హైదరాబాద్‌: యాంటాసిడ్స్, ప్రోబయోటిక్స్‌ కొనుగోళ్లలో అగ్రస్థానంలో ఉండటంతో గట్‌–హెల్త్‌ హబ్‌గా ఉద్భవించింది. కడుపులో అధికంగా ఉండే ఆమ్లాన్ని తటస్థీకరించి గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యల నుండి త్వరగా ఉపశమనం కలిగించే ఔషధాలే యాంటాసిడ్స్‌.  

ముంబై:  మల్టీ విటమిన్స్, సప్లిమెంట్స్, ప్రివెంటివ్‌ కేర్‌లో ముందుంది. కాల్షియం, ప్రోటీన్‌ పౌడర్స్, ఫిట్‌నెస్‌ సప్లిమెంట్స్, ఒత్తిడిని కట్టడి చేసే ఆరోగ్య ఉత్పత్తులకు బలమైన డిమాండ్‌ ఉంది.

ఢిల్లీ: కస్టమర్లు జీర్ణ వ్యవస్థ సంరక్షణ (గట్‌ కేర్‌), లైంగిక ఆరోగ్య ఉత్పత్తులను అధికంగా కొన్నారు. దగ్గు, జలుబు, అలెర్జీ మందుల అమ్మకాలూ ఎక్కువే.

బెంగళూరు: రోగ నిర్ధారణకు పెద్దపీట వేశారు. గట్, చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చారు. సాధారణ సప్లిమెంట్లను అధికంగా స్వీకరించారు.

కోల్‌కతా: డైజెస్టివ్‌ ఎంజైమ్స్, ఎలక్ట్రోలైట్స్‌ను విపరీతంగా వాడారు. ఫిట్‌నెస్, ప్రోటీన్‌–వినియోగ మార్కెట్‌గా క్రమంగా మారుతోంది.  

చెన్నై: గర్భనిరోధక, పునరుత్పత్తి ఆరోగ్య ఉత్పత్తుల కొనుగోళ్లకు ఈ దక్షిణాది నగరం ప్రత్యేకంగా నిలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement