న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు సంస్థల అనుమానం నిజమయ్యింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర పేలిన ఐ20 కారును డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నడిపారని డీఎన్‌ఏ పరీక్షా ఫలితాలను స్పష్టం చేస్తున్నాయని సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తోంది.
డాక్టర్ ఉమర్ మొహమ్మద్.. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో సీనియర్ వైద్యునిగా పనిచేస్తున్నారు. ఆయన డీఎన్‌ఏ నమూనాతో అతని తల్లి, సోదరుని డీఎన్‌ఏతో 100 శాతం సరిపోలిందని అధికారులు తెలిపారని ‘ఎన్‌డీటీవీ’ పేర్కొంది. పేలుడు తర్వాత ఐ20లో దొరికిన ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలను సేకరించి, పరీక్షలు నిర్వహించిన అధికారులు కారు నడిపింది ఉమర్ అనే నిర్థారణకు వచ్చారు. దీనికి ముందు ఉమర్ తల్లిని డీఎన్‌ఏ పరీక్ష కోసం పుల్వామాలో అదుపులోనికి తీసుకున్నారు. అలాగే పేలుడు తరువాత ఉమర్ తల్లి, అతని ఇద్దరు సోదరులను విచారిస్తున్నారు.
జమ్ముకశ్మీర్ పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్‌లోని రెండు నివాస భవనాల నుండి దాదాపు 3,000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పేలుడు సంభవించింది. ఈ నేపధ్యంలో వైట్-కాలర్ ఉగ్రవాద వ్యవస్థలో కీలక లింక్‌గా మారిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. షకీల్ కూడా అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ నివాసి డాక్టర్ ఆదిల్ రాథర్ ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహ్మద్‌కు మద్దతుగా పోస్టర్లు వేసినందుకు అరెస్టు చేశారు. ఆ తరువాత తర్వాత షకీల్‌ను అరెస్టు చేశారు. షకీల్, రాథర్ అరెస్టులతో భయపడిన ఉమర్ ఎర్రకోట సమీపంలో పేలుడుకు కారకునిగా నిలిచాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: Delhi Blast: ట్రాఫిక్‌లో కారు పేలిందిలా.. తాజా వీడియో


