న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన శక్తివంతమైన పేలుడులో 13 మంది మృతి చెందారు. 20 మందికిపైగా జనం గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత, బయటపడిన సీసీటీవీ ఫుటేజ్‌లో రద్దీ సమయంలో హ్యుందాయ్ ఐ20 కారు పేలిన ఖచ్చితమైన క్షణాన్ని చూపించింది.
ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ వన్ సమీపంలోని ట్రాఫిక్ కెమెరా నుంచి లభ్యమైన ఫుటేజ్‌లో.. ట్రాఫిక్ రద్దీలో నెమ్మదిగా కదులుతున్న తెల్లని హ్యుందాయ్ ఐ20 కారు, దాని చుట్టూ ఈ-రిక్షాలు, ఆటోలు, ఇతర వాహనాలు కనిపిస్తున్నాయి. తరువాత పేలుడు దృశ్యం కనిపించింది. సోమవారం సాయంత్రం సరిగ్గా 6:52 గంటలకు జరిగిన ఈ పేలుడు.. జనసాంద్రత అధికంగా ఉన్న పాత ఢిల్లీ ప్రాంతంలో సంభవించింది. అక్కడికి సమీపంలోని వాహనాలు, భవనాలు పేలుడు తీవ్రతకు దెబ్బతిన్నాయి.
#WATCH | Delhi 10/11 Blast: Latest CCTV footage captures the moment of blast#DelhiBlast pic.twitter.com/MjC9fzjqR1
— NDTV (@ndtv) November 12, 2025
కేంద్రం దీనిని హేయమైన ఉగ్రవాద చర్యగా పేర్కొంది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారికంగా దర్యాప్తు చేపట్టింది. సీసీటీవీ వీడియోలో ఐ20 హ్యుందాయ్ కారు భారీ ట్రాఫిక్ గుండా ముందుకు కదలడం తరువాత ఆకస్మిక పేలుడుతో మంటల్లో చిక్కుకోవడం కనిపిస్తుంది. అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకోలోగానే, కారు పూర్తిగా దగ్ధమైపోయింది. దర్యాప్తు అధికారులు ఆ వాహనం HR 26CE7674 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగినదిగా గుర్తించారు. దీనిని పాకిస్తాన్‌కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న అనుమానిత సభ్యుడు డాక్టర్ ఉమర్ నబీ నడిపినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ ఉమర్ నబీ అక్టోబర్ 29న ఫరీదాబాద్‌కు చెందిన సోను అనే కార్ డీలర్ నుండి ఐ20ని కొనుగోలు చేశాడు. తరువాతి సీసీటీవీ ఫుటేజ్‌లో నబీ ఆ కారును రాయల్ కార్ జోన్ సమీపంలోని కాలుష్య నియంత్రణ (పీయూసీ) బూత్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం నబీ ఆ కారును అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాడని, అక్కడ డాక్టర్ ముజమ్మిల్ షకీల్ యాజమాన్యంలోని స్విఫ్ట్ డిజైర్ పక్కన పార్క్ చేశాడని దర్యాప్తు అధికారులు కనుగొన్నారని ‘ఎన్‌డీటీవీ’ తన కథనంలో పేర్కొంది. కాగా అతని నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న తరువాత పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ షకీల్ వాహనం లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్ పేరుతో రిజిస్టర్ అయివుంది. ఆయనను కూడా ఉగ్రవాద సంబంధాల ఆరోపణలతో అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Delhi blast: అయోధ్యలో స్లీపర్ సెల్? వారణాసిలో..


