న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ కారు పేలుళ్లతో సంబంధం కలిగిన ఉగ్రవాద ముఠా ఉత్తరప్రదేశ్‌లోని మతపరమైన ప్రదేశాలను, ముఖ్యంగా అయోధ్య, వారణాసిని లక్ష్యంగా చేసుకున్నదని నిఘా వర్గాలు కనుగొన్నాయి. ‘ఇండియా టీవీ’ తెలిపిన వివరాల ప్రకారం అయోధ్యలో భారీ పేలుడుకు ఈ బృందం ప్రణాళిక రచించిందని, ఢిల్లీ పేలుడు కేసులో అరెస్టయిన డాక్టర్ షాహీన్ షాహిద్.. స్లీపర్ సెల్‌ను ఇప్పటికే యాక్టివేట్ చేశాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రణాళిక అమలుకు ముందే యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)తోపాటు స్థానిక పోలీసుల సాగించిన వరుస దాడులు, అరెస్టులు ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఛేదించడానికి దారితీశాయి.
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఉగ్రవాదుల ముఠా ప్రణాళికలో భాగం కాదని విచారణ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం పేలుడు పరికరంలో టైమర్ లేదా రిమోట్ ట్రిగ్గర్ లేదు. దీని ప్రకారం చూస్తే పేలుడు ప్రమాదవశాత్తు లేదా తొందరపాటులో జరిగి ఉండవచ్చని సూచిస్తున్నది. అనుమానితులు పేలుడు పదార్థాలను రవాణా చేస్తుండగా, అది పేలిపోయిందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
అధికారుల విచారణలో ఉగ్రవాద నెట్‌వర్క్ ఆస్పత్రులు, ఇతర రద్దీగా ఉండే ప్రాంతాలను కూడా టార్గెట్ చేసినట్లు తేలింది. నిందితులు లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల్లో అధిక రద్దీతో ఉండే ఆస్పత్రులు, జనసమ్మర్థం ఉన్న ప్రదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో భద్రతా సంస్థలు తాజాగా కమ్యూనికేషన్ రికార్డులు, డిజిటల్ ట్రయల్స్, ఈ మాడ్యూల్, ఉత్తర భారతదేశంలో చురుగ్గా ఉన్న ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాలను పరిశీలిస్తున్నాయి.
సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నిలిపివుంచిన హ్యుందాయ్ ఐ20 కారులో చోటుచేసుకున్న పేలుడులో 13 మంది మృతిచెందారు. 20 మందికి పైగా జనం గాయపడ్డారు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ పేలుడు కారణంగా మంటలు చెలరేగి, సమీపంలోని కార్లకు వ్యాపించాయి. స్టేషన్ గేట్ నంబర్ వన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)విచారణ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Delhi blast: చెదిరిన టాటూలు, చిరిగిన టీ-షర్టులు..


