న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి మరో కీలక ఆధారం లభ్యమయ్యింది. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల కారు బాంబు దాడికి పాల్పడిన కేసులో మరో ముందడుగు పడింది. ఈ ఘటనలో కీలకంగా ఉన్న సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం కల్పించిన హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన సోయాబ్‌ను తాజాగా ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇండియా టీవీ అందించిన కథనం ప్రకారం సోయాబ్ ఉగ్రవాది ఉమర్‌కు లాజిస్టికల్(రవాణా) సాయాన్ని అందించాడు. ఈ పేలుడులో 15 మంది మృతిచెందగా, 20 మందికి పైగా జనం గాయపడ్డారు. ఇది యావత్ దేశాన్నీ భయభ్రాంతులకు గురిచేసింది. కాగా సోయాబ్ అరెస్టుతో ఈ కేసులో ఎన్‌ఐఏ అరెస్టు చేసిన నిందితుల సంఖ్య ఏడుకు చేరింది. షోయబ్.. జమ్ముకశ్మీర్ పోలీసులు గతంలో ఛేదించిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌లో భాగమని విచారణలో తేలింది. అలాగే ఈ కేసులో సోయాబ్ పాత్ర ఉగ్రవాది ఉమర్‌కు బస కల్పించడం వరకూ మాత్రమే పరిమితం కాలేదని తేలింది.
ఫరీదాబాద్‌లోని అల్ఫాలా విశ్వవిద్యాలయంలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేసిన సోయాబ్, ఆ విశ్వవిద్యాలయ ప్రయోగశాల నుండి పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన రసాయనాలను సేకరించేందుకు ఉమర్‌కు సహాయం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే సోయాబ్.. హర్యానాలోని నుహ్‌లోని హిదాయత్ కాలనీలో ఉమర్ కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఈ ఇంటిని ఉమర్ తాను తప్పించుకునే సమయంలో ఉపయోగించాడు. అలాగే ఇక్కడే పేలుడు పదార్థాలను కూడా నిల్వ చేశాడని అధికారులు వెల్లడించారు.
ఈ అద్దె ఇంటిని హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) నవంబర్ 16న తనిఖీ చేసి, ఆ తర్వాత సీలు చేసింది. ఇక్కడి నుంచే ఉమర్ కారులో ప్రయాణించాడు. ఈ ప్రయాణ మార్గాన్ని కూడా అధికారులు గుర్తించారు. ఫిరోజ్‌పూర్ ఝిర్కాలో ఏటీఎం నుండి డబ్బు విత్‌డ్రా చేసుకున్న తరువాత, ఉమర్ ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పైనుంచి బాదర్‌పూర్ మీదుగా ఐ20 కారులో ఢిల్లీలోకి ప్రవేశించాడు. తరువాత ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో ఆ కారు పేలిపోయింది. దీంతో మంటలు చెలరేగి సమీపంలోని ఇతర వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. ఈ దాడిని కేంద్ర మంత్రివర్గం ఉగ్రవాద ఘటనగా పేర్కొంది. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించేందుకు దర్యాప్తు సంస్థలు కృషి చేయాలని ఆదేశించింది. ఎన్‌ఐఏ ప్రస్తుతం ఆత్మాహుతి బాంబు దాడికి సంబంధించిన వివిధ ఆధారాలను సేకరిస్తోంది. ఈ దాడిలో భాగస్వామ్యమున్న ఇతరులను గుర్తించేందుకు పోలీసు బలగాలతో సమన్వయంతో వివిధ రాష్ట్రాలలో సోదాలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: కమ్రా టీ షర్టు వివాదం: ఉతికి ఆరేసిన బీజేపీ, శివసేన


