అమ్మాయి ప్రేమ కోసం ‘యాక్సిడెంట్’ డ్రామా..
ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలి..
తన దృష్టిలో హీరోగా నిలిచిపోవాలి..
ఇదీ ఒక యువకుడి పిచ్చి ఆలోచన.
దీనికోసం అతను వేసిన ప్లాన్ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.
రోడ్డుపై ఘోర ప్రమాదం
డిసెంబర్ 23వ తేదీ సాయంత్రం 5.30 గంటలు. కోచింగ్ క్లాస్ ముగించుకుని ఓ యువతి తన స్కూటర్‌పై ఇంటికి వెళ్తోంది. పతనంతిట్ట సమీపంలోని వళ ముట్టం ఈస్ట్ వద్దకు రాగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు ఆమె స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి ఆమె గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. కారు ఆగకుండా మెరుపు వేగంతో వెళ్లిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి స్థానికులు భయబ్రాంతులయ్యారు.
‘రక్షకుడు’ ఎంట్రీ
ఏం చేయాలో తెలియక జనం తత్తరపడుతున్న సమయంలో.. అక్కడికి ఒక ఇన్నోవా కారు వచ్చి ఆగింది. అందులో నుంచి రంజిత్ రాజన్ అనే యువకుడు కంగారుగా దిగాడు. ‘నేను ఆమె భర్తను’.. అంటూ అందరినీ నమ్మించాడు. ఎంతో ఆవేదన నటిస్తూ ఆమెను హుటాహుటిన కొన్నీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అందరూ అతన్ని ‘దేవుడు పంపిన రక్షకుడు’ అని మెచ్చుకున్నారు.
విస్తుపోయే నిజం!
ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య తనిఖీల్లో.. ఆ యువతికి తీవ్ర గాయాలైనట్లు తేలింది. కుడి చేయి ఎముక పక్కకు జరగడం, వేలు విరగడంతో పాటు ఒళ్లంతా గాయాలయ్యాయి. మొదట ఇది సాధారణ హిట్ అండ్ రన్ కేసు అని పోలీసులు భావించారు. కానీ, విచారణ ముదిరే కొద్దీ పోలీసులకు అనుమానం కలిగింది. రంజిత్ మాటల్లో పొంతన లేకపోవడంతో లోతుగా ఆరా తీశారు. అప్పుడు బయటపడింది అసలు గుట్టు.
పక్కా ప్రణాళికతో..
ఆ ప్రమాదం అనుకోకుండా జరిగింది కాదు.. రంజిత్ పక్కాగా ప్లాన్ చేసి చేయించాడు.. అదెలా అంటే.. ‘యువతిని తన స్నేహితుడు అజాస్ కారుతో గుద్దిస్తాడు. వెంటనే తనే అక్కడికి చేరుకుని కాపాడినట్టు నటించాలి. యువతికి, ఆమె కుటుంబానికి తనపై విపరీతమైన ప్రేమ, కృతజ్ఞత కలిగేలా చేయాలి. మళ్లీ ఆమెను తన దారిలోకి తెచ్చుకోవాలి..’
పారని సైకో ప్రేమికుడి పాచిక
ప్రేమ పేరుతో ప్రాణాల మీదకు తెచ్చిన ఈ ‘సైకో’ ప్రేమికుడి పాచిక పారలేదు. పోలీసులు రంజిత్‌తో పాటు అతడికి సహకరించిన అజాస్ ను అరెస్ట్ చేశారు. సాధారణ యాక్సిడెంట్ కేసు కాస్తా ఇప్పుడు ‘హత్యాయత్నం’ కేసుగా మారింది. నకిలీ ‘ప్రేమల’ వెనుక దాగున్న ఇలాంటి క్రూరత్వాలపై అప్రమత్తంగా ఉండాల్సిందే..
– సాక్షి, నేషనల్ డెస్క్


