రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో నిర్మలా సీతారామన్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న భట్టివిక్రమార్క
తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక చేయూతనివ్వండి
హైదరాబాద్ మెట్రో ఫేజ్–2, ఆర్‌ఆర్‌ఆర్‌కు తక్షణమే అనుమతులివ్వాలి
ప్రీ–బడ్జెట్ భేటీలో కీలక ప్రతిపాదనలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక ప్రగతిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రాబోయే కేంద్ర బడ్జెట్‌లో సముచిత ప్రాధాన్యం కల్పించాలని, రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఢిల్లీలోని అశోక్ హోటల్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ప్రీ–బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘వికసిత్ భారత్’లక్ష్య సాధనలో తెలంగాణ పాత్రను వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులపై భట్టి నివేదిక సమరి్పంచారు.
కేంద్రం తోడ్పాటు అందించాలి...
దేశ జీడీపీలో తెలంగాణ వాటా ప్రస్తుతం 5.1 శాతంగా ఉందని, దీన్ని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని భట్టి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘తెలంగాణ రైజింగ్–2047’విజన్‌ను రూపొందించామని, దీని ద్వారా ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరమని, ఇందుకు రాష్ట్రంలో పెట్టుబడి రేటును ప్రస్తుతమున్న 37 శాతం నుంచి 50 శాతానికి (జీఎస్డీపీలో) పెంచాల్సి ఉందని, దీనికి కేంద్రం తోడ్పాటు అందించాలని కోరారు.
పన్నుల పంపిణీలో అన్యాయం...
రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో 41 శాతం వాటా ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టంగా సిఫారసు చేసినప్పటికీ, ఆచరణలో మాత్రం 30 శాతం నిధులు మాత్రమే అందుతున్నాయని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం విధిస్తున్న సెస్సులు, సర్ చార్జీల వాటా 20 శాతానికి చేరడమే ఇందుకు కారణమన్నారు. దాదాపు రూ.1,55,000 కోట్ల సర్ చార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించాలని లేదా వాటిని ప్రాథమిక పన్ను రేట్లలో కలిపి రాష్ట్రాలకు న్యాయబద్ధమైన వాటా పంచాలని ఆయన సూచించారు. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో రాష్ట్రాల వాటాను తగ్గించి, ఆ నిధులను (దాదాపు రూ.2.21 లక్షల కోట్లు) నేరుగా రాష్ట్రాలకే బదిలీ చేయాలని కోరారు. రాష్ట్రాల ఆర్థిక వెసులుబాటు కోసం ద్రవ్య లోటు పరిమితిని ఏడాదికి కనీసం 4 శాతానికి పెంచాలని భట్టి డిమాండ్ చేశారు. విద్య, ఆరోగ్య రంగాల కోసం సేకరించే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని కోరారు.
భారీ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల కోసం...
రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని, హైదరాబాద్ మెట్రో రెండో దశకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని భట్టి కోరారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని స్పష్టం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం రూ.14,100 కోట్లు, హైదరాబాద్‌లో రేడియల్ రోడ్ల కోసం రూ.45,000 కోట్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ కోసం రూ.17,212 కోట్లు కేటాయించాలని కోరారు. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాలను మంజూరు చేయాలని, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటును ప్రకటించాలని భట్టి తన ప్రసంగంలో ప్రస్తావించారు.


