ఢిల్లీలో పట్టుబడిన ఆయుధాలు, డ్రగ్స్, మద్యం
966 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ ఢిల్లీ పోలీసులు నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు. శుక్రవారం వాయవ్య ఢిల్లీలో ‘ఆపరేషన్ ఆఘాత్ 3.0’పేరుతో చేపట్టిన దాడుల్లో భారీ సంఖ్యలో ఆయుధాలు, మాదకద్రవ్యాలు, మద్యంతోపాటు వాహనాలు పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా పలు నేరారోపణలపై 966 మందిని అదుపులోకి తీసుకున్నారు.
కొత్త సంవత్సర వేడుకల సమయంలో నివాస ప్రాంతాలు, మురికివాడల్లో నేరాలకు పాల్పడే వారిని, వీధి ఘర్షణలను అదుపు చేసేందుకే ఈ ఆపరేషన్ చేపట్టామన్నారు. ఆపరేషన్ ఆఘాత్ 3.0 సమయంలో 21 దేశవాళీ పిస్టళ్లు, 20 తూటాలు, 27 కత్తులను ఆయుధాల చట్టం కింద స్వా«దీనం చేసుకున్నామని వివరించారు. 12,258 క్వార్టర్ల అక్రమ మద్యం, 6కిలోల గంజాయితోపాటు రూ.2.36 లక్షల నగదును గ్యాంబ్లర్స్ నుంచి సీజ్ చేసినట్లు చెప్పారు.
మొత్తం 310 సెల్‌ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు, ఒక కారును పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో 600 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారన్నారు. నేరాలకు పాల్పడినట్లు తేలితే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 11, 112 కింద కేసులు నమోదు చేసి బహిష్కరణ దండన వంటి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


