ర్యాలీలో పాల్గొన్న వారికి టీషర్టులు మెడల్స్ అందజేస్తున్న నటుడు మోహన్‌బాబు, ఎమ్మెల్యేలు
మంత్రి సుబ్రమణియన్
తిరువళ్లూరు: రాష్ట్రంలో మత్తుపదార్థాల విక్రయాలపై మరింత నిఘా పెంచుతామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ అధ్యక్షతన ద్విచక్ర వాహన ర్యాలీ జరిగింది. ముఖ్య అతిథులుగా ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్, సినీనటుడు మంచు మోహన్‌బాబు, ఆర్య తదితరులు హాజరై ర్యాలీని ప్రారంభించారు. మెడికల్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎమ్మెల్యే కార్యాలయం వరకు సాగింది.
ర్యాలీని ప్రారంభించిన అనంతరం మంత్రి సుబ్రమణియన్ మాట్లాడుతూ రాష్ట్రంలో గుట్కా, గంజాయి, మత్తుమాత్రల విక్రయాలు గతంలో కంటే తగ్గాయన్నారు. కర్ణాటకలో గుట్కాలు, ఒడిశా నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారని వివరించారు. కర్ణాటక, ఒడిశా, ఆంధ్ర నుంచి వచ్చే పండ్లు కూరగాయల వాహనాల ద్వారా అక్రమ రవాణా జరుగుతోందని, ఈనేపథ్యంలో సరిహద్దుల్లో వాహనాల తనిఖీ మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో గంజాయి విక్రయాలపై పూర్తిగా పట్టు సాధించి కట్టడి చేశామన్నారు. గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా వారిపై గుండా చట్టం ప్రయోగించడంతో పాటూ నిందితుల బ్యాంకు ఖాతాలను సైతం స్తంబింపజేస్తున్నట్టు తెలిపారు. కాగా బైక్ ర్యాలీలో పాల్గోన్న వారికి సర్టిఫికెట్‌లు, మెడల్స్, టీషర్ట్స్‌లను ప్రముఖ సినీనటుడు మంచు మోహన్‌బాబు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ తిరుత్తణి చంద్రన్ తదితరులు పాల్గొన్నారు.


