సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో అత్యవసర వైద్య సేవలను మరింత వేగవంతం చేస్తూ కావేరి హాస్పిటల్ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. రోగిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలోనే నిపుణులైన వైద్యులు పర్యవేక్షించేలా, అత్యాధునిక 5జీ కనెక్టివిటీ కలిగిన 5జీ కంటిన్యూయస్ కేర్ అంబులెన్స్ సేవలకు బుధవారం శ్రీకారం చుట్టారు. వీటిని గ్రేటర్ చైన్నె కమిషనర్, అడిషనల్ డీజీపీ ఎ.అమల్‌రాజ్ ప్రారంభించారు. కావేరి హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపకులు – మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మణివన్నన్ సెల్వరాజ్ పాల్గొన్నారు. నగరంలోని అల్వార్‌పేట్, వడపళని, రేడియల్ రోడ్ పరిధిలో మొత్తం 30కి పైగా అత్యాధునిక అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఈ వాహనాల్లో నియోనేటల్, పీడియాట్రిక్, న్యూరో లాజికల్, కార్డియాక్ వంటి అన్ని రకాల అత్యవసర వైద్య సేవలకు అవసరమైన లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ కల్పించారు. కంటిన్యూయస్ పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అంబులెన్స్‌లో రోగి ప్రయాణించే సమయంలోనే అన్ని రకాల డేటాను సేకరించే దిశగా చర్యలు తీసుకున్నారు. 5జీ వేగం – లైవ్ డాక్టర్ గైడెన్స్, 5జీ కనెక్టివిటీతో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఎలాంటి అంతరాయం లేకుండా డేటా వేగంగా అందుకునే దిశగా సాంకేతికతను సిద్ధం చేశారు.


