క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Aug 13 2026 1:21 AM | Updated on Aug 13 2026 1:21 AM

ప్రయాణికుల సామగ్రి, పార్సిళ్లపై ఆంక్షలు పండుగ సీజన్‌ లక్ష్యంగా అద్వైత్‌ 8.ఓ ఎండోమెంట్‌ కింద కళాశాలలు నిర్మించండి టోల్‌గేటు గార్డ్‌ హత్య కేసులో జీవిత ఖైదు

కొరుక్కుపేట: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు తమిళనాడులోని రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి చైన్నె సెంట్రల్‌, ఎగ్మోర్‌ రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రైళ్లలో పంపే పార్సిళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. పేలుడు పదార్థాలు ఏమైనా తీసుకువెళ్తున్నారా అనేది తనిఖీ చేయడానికి స్కానర్‌ను ఉపయోగిస్తున్నారు. పార్సిల్‌ కార్యాలయానికి వచ్చే అన్ని ప్యాకేజీలను తనిఖీ చేసి పంపుతున్నారు. సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ నాలుగు ప్రవేశ ద్వారాల వద్ద మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పోలీసులు, తమిళనాడు ప్రభుత్వ పోలీసులు రోజుకు 24 గంటలూ నిఘా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఎగ్మోర్‌ రైల్వే స్టేషన్‌లో అదనపు పోలీసు సిబ్బందిని కూడా మోహరించారు. స్టేషన్‌లోకి ప్రవేశించే ప్రయాణికులు, వారి సామగ్రిని స్కానర్ల ద్వారా తనిఖీ చేస్తున్నారు. ఈ పరీక్ష 15వ తేదీ రాత్రి వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

సాక్షి, చైన్నె: అపారెల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో చైన్నెలోని ఆర్‌కే కన్వెన్షన్‌ సెంటర్‌లో అద్వైత్‌ 8.ఓ మెగా ఎక్స్‌పో జరిగింది. దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి సుమారు 1,400 మందికి పైగా రిటైల్‌ వర్తకులు హాజరయ్యారు. ఈ ఎక్స్‌పోను ప్రముఖ పారిశ్రామికవేత్త పద్మశ్రీ డాక్టర్‌ నల్లీ కుప్పుస్వామి చెట్టియార్‌, తష్వీన్‌ (మహారాజా టెక్స్‌టైల్స్‌ మలేషియా), ఎం.ఎస్‌.ఆసిఫ్‌ అలీ (మెజెస్టిక్‌ మహారాజా), ఎల్‌.రవీంద్రన్‌ జీ (ఎస్‌. నల్లపెరుమాళ్‌ అండ్‌ సన్స్‌, నాగర్‌కోయిల్‌), విశాల్‌ గౌడ (రూప్‌ సంగమ్‌ – బెంగళూరు), ఆర్‌కే కన్వెన్షన్‌ సెంటర్‌కు చెందిన ఆర్‌.కరుణానిధి, ఆర్‌కే అరసి సంయుక్తంగా ప్రారంభించారు. రాబోయే పండగల సీజన్‌ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న 220 కి పైగా ప్రముఖ వస్త్ర బ్రాండ్లు తమ సరికొత్త కలెక్షన్లను ఈ వేదికపై ప్రదర్శించాయి. ముంబయి, ఇండోర్‌, సూరత్‌ వంటి ప్రముఖ నగరాల నుంచి తయారీదారులు భారీగా తరలివచ్చారు. ఈ ప్రదర్శనలో స్థానిక వ్యాపారులతో పాటు మలేషియా, కువైట్‌, శ్రీలంక దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ కొనుగోలుదారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కొరుక్కుపేట: మద్రాస్‌ హైకోర్టు తీర్పును అనుసరించి ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ తరపున 6 ఆర్ట్‌ కళాశాలలు నిర్మించాలని మాజీ మంత్రి పి.కె. శేఖర్‌బాబు డిమాండ్‌ చేశారు. డీఎంకే పాలన తర్వాత 2021లో హిందూ మత దేవాదాయ శాఖ కింద నాలు కళాశాలల పనులు ప్రారంభించినట్టు తెలిపారు. అలాగే అదే సంవత్సరం డిసెంబర్‌లో 10 ఆర్ట్‌ కళాశాలలు ప్రారంభించామని తెలిపారు. రెండింటిపై కొందరు కోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఛారిటీస్‌ శాఖ చట్టం ప్రకారం కళాశాలల నిర్మాణం అనుమతించదగినదేనని పేర్కొంటూ సుప్రీం కోర్టు పిటిషన్‌ను కొట్టేసిందన్నారు. కళాశాలలను నిర్మించుకోవచ్చని హైకోర్టు కూడా మంగళవారం తీర్పు ఇచ్చిందన్నారు. 2021లో హిందూ మత, దేవాదాయ శాఖ నిధుల ద్వారా తాము ప్రకటించిన 10 ఆర్ట్‌ కళాశాలలలో, 4 కళాశాలలు మూసివేశారని, మిగిలిన 6 ఆర్ట్‌ కళాశాలలను ప్రభుత్వం నిర్మించాలని పి.కె. శేఖర్‌ బాబు కోరారు.

తిరువళ్లూరు: టోల్‌గేటు సిబ్బందిని హత్య చేసిన ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తిరువళ్లూరు కోర్టు తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా పుదువాయల్‌ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్‌ నరేష్‌కుమార్‌ 2020 జనవరి 24న పుదువాయల్‌ నుంచి సరుకు లారీతో బయలుదేరాడు. ఆవడి సమీపంలోని ముత్తాపుదుపేట టోల్‌గేట్‌ వద్ద లారీని ఆపి నిద్రకు ఉపక్రమించాడు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంలో వచ్చిన తిరునిండ్రవూర్‌కు చెందిన విజయకుమార్‌(29), సురేష్‌ (25) డ్రైవర్‌ నరేష్‌కుమార్‌పై దాడి చేసి రూ.4 వేల నగదు, సెల్‌పోన్‌ను లాక్కుకునే ప్రయత్నం చేశారు. టోల్‌గేటు గార్డుగా పనిచేస్తున్న వెంకటేషన్‌ వారిని అడ్డుకోబోయాడు. అతనిపై విజయకుమార్‌, సురేష్‌ దాడి చేయడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తును చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి జూలియట్‌పుష్ప నిందితులు ఇద్దరికి జీవితఖైదు, రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement