వేలూరు: తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ వేలూరు జిల్లా కన్నియంబాడి యూనియన్ పరిధిలోని తుత్తిపట్టు గ్రామస్తులు బుధవారం ఖాళీ బిందెలతో వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ గ్రామంలో సుమారు వంద కుటుంబాలకు పైగా జీవిస్తున్నట్టు తెలిపారు. తమ ప్రాంతం మిట్ట ప్రాంతం కావడంతో ఆరు నెలలుగా తాగునీటి సమస్య నెలకొందని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇదిలా ఉండగా అనుమతి లేకుండా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసేందుకు అనుమతించబోమని పోలీసులు తెలపడంతో గ్రామస్తులు చేసేది లేక ఖాళీ బిందెలతో రోడ్డుకు అడ్డంగా కూర్చొని నినాదాలు చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ తమ ప్రాంతంలో తాగునీటి సమస్యపై ఇది వరకే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. గతంలో వినతి పత్రం అందజేసిన సమయంలో అఽధికారులు వచ్చి తూతూ మంత్రంగా పనులు చేసి నీటిని వారం రోజుల పాటు సరఫరా చేశారని, అనంతరం తమ వద్ద నిధులు లేవని చేతులు ఎత్తేశారని వాపోయారు. అధికారులు ఇప్పటికై నా తాగునీటి సమస్యను పరిష్కరించకుంటే గ్రామస్తులచే ఖాళీ బిందెలతో కలెక్టరేట్‌ను ముట్టడించి దీక్ష చేపడతామన్నారు.


