తొలగించిన వైద్యుడిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
నిలిచిన వైద్య సేవలు..రోగులకు తప్పని ఇక్కట్లు
సిమ్లా: రెసిడెంట్ డాక్టర్ల నిరవధిక సమ్మె కారణంగా శనివారం హిమాచల్‌ప్రదేశ్ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా వైద్య సేవలు నిలిచిపోయాయి. రోగిపై చేయిచేసుకున్నాడనే కారణంతో వైద్యుడిని 48 గంటల్లోనే విధుల నుంచి తొలగించడం అన్యాయమని వైద్యులు వాదిస్తున్నారు. ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగారు.
ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీతోపాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు శుక్రవారం మూకుమ్మడి సెలవుపై వెళ్లారు. దీంతో, ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి సిమ్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచి్చన రోగులు, వారి సంబంధీకులు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. సిమ్లాతోపాటు ధర్మశాల, నహాన్, హమీర్‌పూర్, ఉనా తదితర జిల్లాల్లో సమ్మె ప్రభావం కనిపించింది.
శనివారం నుంచి జరుగుతున్న నిరవధిక సమ్మె సందర్భంగా ఎమర్జెన్సీ సేవలు మాత్రమే పనిచేస్తాయని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. ‘వైద్యుడు అవ్వాలంటే ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వైద్యుడూ మానవమాత్రుడే. ఘటనలో అనుచిత ప్రవర్తనను మేమూ అంగీకరిస్తున్నాం. ఆరు గంటల్లో సస్పెండ్ చేశారు సరే.
క్రమ శిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యుడైన వైద్యుడిని 48 గంటల్లోనే విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలివ్వడం సరికాదు. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలన్నదే మా ఏకైక డిమాండ్’అని వివరించింది. ‘ప్రభుత్వ చర్య వైద్య వర్గాల్లో తీవ్ర వ్యతిరేక ప్రభావం కలిగించింది. ఏమాత్రం భద్రత లేదని వైద్యులు భావించే పరిస్థితికి వైద్యులు చేరుకున్నారు’అని తెలిపింది.
ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ పల్మనరీ వార్డులో సోమవారం అర్జున్ సింగ్ అనే రోగి, రాఘవ్ నరులా అనే వైద్యుడిని నువ్వు అని సంబోధించడంతో మొదలైన గొడవ, ఇద్దరి మధ్య కొట్లాటకు దారితీసింది. డాక్టర్ రాఘవ్ నరులా రోగిపై ముష్ఠిఘాతాలు కురిపిస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారుల కమిటీ..ఇద్దరిదీ తప్పేనని తేలి్చంది.
వైద్యుడు నరులా ప్రవర్తన ప్రజా సేవకుడి హోదాకు తగినట్లుగా లేదని పేర్కొనడంతో ప్రభుత్వం ఆయన్ను వెంటనే విధుల నుంచి తొలగించింది. అయితే, హిమాచల్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్, సిమ్లా అసోసియేషన్ ఆఫ్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ టీచర్స్, సిమ్లా ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్లు డాక్టర్ నరులాకు మద్దతు ప్రకటించాయి. ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు శుక్రవారం సీఎం సుఖ్‌వీందర్ సింగ్‌కు వినతిపత్రం సమర్పించాయి.


