యజమాని మృతదేహంతో పిట్‌బుల్ నిరీక్షణ
చంబా లోయ.. చుట్టూ ఎత్తైన కొండలు, అంతకంటే ఎత్తులో పరుచుకున్న మంచు తెరలు. ఇద్దరి ప్రాణాలు ఆ మంచు తుపానులో కలిసి పోయాయి. వారికోసమే సహాయక బృందాలు గాలిస్తున్నాయి. హెలికాప్టర్ శబ్దం తప్ప అక్కడ మరో అలికిడే లేదు. కానీ, ఒక మృతదేహం దగ్గరకు వెళ్తుంటే సహాయక బృందానికి ఊహించని అడ్డంకి ఎదురైంది.
మంచులో నాలుగు రోజులు
హిమాచల్ ప్రదేశ్‌లో మంచు పడుతుంటే వీడియోలు తీయడానికి.. పీయూష్ అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి ట్రెకింగ్‌కు వెళ్లారు. అయితే, అకస్మాత్తుగా విరుచుకుపడిన మంచు తుపానులో వారు చిక్కుకుపోయారు. దురదృష్టవశాత్తూ, సహాయక చర్యలు అందేలోపే ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, పీయూష్ మృతదేహం పక్కనే అతని పెంపుడు కుక్క (పిట్‌బుల్) కూర్చుని ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు.
మృత్యువుతో పోరాటం
నాలుగు రోజులు.. అక్షరాలా నాలుగు పగళ్లు, నాలుగు రాత్రులు ఆ మంచు తుపానులో అది ఎలా ప్రాణాలతో ఉందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ దాని కళ్లలో ఉన్నది భయం కాదు, తన యజమానిని రక్షించుకోవాలనే తపన. సహాయక బృందం మృతదేహాన్ని తాకడానికి ప్రయత్నిస్తే, ఆ కుక్క తీవ్రంగా ప్రతిఘటించింది. తన యజమాని గాఢ నిద్రలో ఉన్నాడనుకుందో ఏమో, ఎవరినీ రానివ్వలేదు. చివరకు బలవంతంగా శునకానికి గంతలు కట్టి, యజమాని మృతదేహంతో పాటు దాన్ని హెలికాప్టర్‌లో తరలించాల్సి వచ్చింది.
యజమాని లేచి వస్తాడనుకుని..
సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాక కూడా, ఆ కుక్క తన తోక ఆడిస్తూ.. యజమాని ఇప్పుడే లేచి తనతో ఆడతాడన్నట్టు అమాయకంగా చూస్తుండటం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. మంచు కొండల్లో ఆ మూగజీవి చూపిన ప్రేమ అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.


