హిమాచల్ ప్రదేశ్‌లో కరుగుతున్న మంచు కొండలు
మంచు కురవడం తెలిసిందే.. కానీ మంచు పారడమే వింత. ఎండిపోయిన నేలలు.. మంచు కోసం నిరీక్షించిన కొండల్ని ఒక్కసారిగా ప్రకృతి పలకరించింది. కానీ, ఈసారి పలకరింపు మామూలుగా లేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా, పాంగి లోయలో ప్రకృతి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. గలగల పారే నదులను చూసుంటాం, కానీ ఇక్కడ ఏకంగా ‘మంచు నదే’రోడ్ల మీద ఉరకలేస్తోంది..
కనులముందే కదిలే హిమ కావ్యం!
దాదాపు ఏడాది కాలంగా మంచు కరువుతో అల్లాడిన హిమాలయాల్లో, పశి్చమ గాలులు సృష్టించిన ఇంద్రజాలమిది. పన్నెండు అంగుళాల మందపాటి మంచు పొర కరిగి, లోయల వెంట ప్రవహిస్తుంటే.. అది చూడ్డానికి తెల్లటి పాల సముద్రంలా కనిపిస్తోంది. స్థానికులు ఆ మంచు నదిపై అడుగులు వేస్తూ ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
దారులు అదృశ్యం
అందాన్ని పక్కన పెడితే, ఈ హిమపాతం సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. హిమాచల్‌లో ఏకంగా 700కు పైగా రోడ్లు మంచు కింద కూరుకుపోయాయి. విమానాలు రద్దయ్యాయి, హైవేలు మూతపడ్డాయి. జమ్మూ కశీ్మర్ నుంచి ఉత్తరాఖండ్ వరకు అంతా మంచు మేఘాలు కమ్ముకున్నాయి. ఒకవైపు ఢిల్లీలో వడగళ్ల వాన, మరోవైపు హిమాలయాల్లో మంచు తుపాన్లు.. ప్రకృతి తన గమనాన్ని ఎంత వేగంగా మార్చుకుంటుందో ఈ దృశ్యాలే సాక్ష్యం.
వరం.. శాపం ఒకేసారి
మంచు కురవడం వల్ల గంగా, బియాస్, చీనాబ్ వంటి నదులకు జీవం వస్తుంది. అటు పంజాబ్, హరియాణా రైతులు సాగు చేసే గోధుమ పంటకు ఇది అమృతం లాంటిది. కానీ, ఇలా ఒక్కసారిగా విరుచుకుపడే ప్రతికూల వాతావరణం.. భవిష్యత్తులో పెను ప్రమాదాలకు సూచికని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆ తెల్లటి పొర కింద లోయ ఉంది.. హిమాచల్ మంచు అందం వెనుక ఒక భయానక నిశ్శబ్దం దాగి ఉంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


